ఎన్నికల సన్నద్ధత పై కలెక్టర్ సమీక్ష

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.

Update: 2024-04-15 13:43 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నద్ధతపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం సాయంత్రం నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18 న విడుదల కానుండగా, ఆ రోజు నుండే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పక్కాగా పరిశీలించుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా చేపట్టిన చర్యల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సౌకర్యాల కల్పన, ఎన్నికల నిర్వహణ కోసం నియమించబడిన సిబ్బందికి శిక్షణ తరగతులు, తనిఖీ బృందాలు, చెక్ పోస్టులు, భద్రతాపరమైన చర్యలు, ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం నిల్వలు, ఇతర విలువైన వస్తువులు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు.

ఎక్కడ కూడా, ఏ దశలోనూ తప్పిదాలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ఈ.సీ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, స్వీప్ అధికారి సురేష్ కుమార్, ఆర్డీఓలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News