రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ పరిశ్రమల పై దృష్టి సారించాలి.. కలెక్టర్

రైతులు వ్యయసాయంతో పాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్ తోటల పెంపకం వంటి వాటి పై దృష్టిసారించి ఆర్థిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు.

Update: 2024-06-26 11:33 GMT

దిశ, కామారెడ్డి : రైతులు వ్యయసాయంతో పాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్ తోటల పెంపకం వంటి వాటి పై దృష్టిసారించి ఆర్థిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్ కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అక్కడ పశుసంవర్ధక శాఖ, ఉద్యాన, మత్స్య శాఖ, విజయ డెయిరీ, పరిశ్రమల శాఖ, నాబార్డు తదితర సంస్థలు తమ ఉత్పత్తులు, పరికరాలతో ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ను, ప్రైవేట్ విత్తనాలు, ఎరువుల కంపెనీలు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్ల స్టాల్ల్స్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయ వనరులను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా వివిధ పథకాలు అమలు చేస్తూ సబ్సిడీ అందిస్తున్నదని అన్నారు. బ్యాంకర్లు ఉదారంగా రుణాలు అందించి రైతులకు ఇతోధికంగా చేయూత నివ్వాలని కోరారు. కిసాన్ మేళల ద్వారా రైతులకు అధునాతన వ్యవసాయంలో సూచనలు, మెళకువలు, సాంకేతిక సలహాలు, శాస్త్ర పరిశోధన ఫలాలు అందిస్తూ అవగాహన కలిగిస్తున్నదని, రైతులు వాటిని ఆకళింపు చేసుకొని సంపద పెంపొందించుకునే దిశగా ఎదగాలని కోరారు. పాల ఉత్పత్తి, పశు సంపద పెరగాలంటే నాణ్యమైన మేలుజాతి పాడిపశువుల ఎంపిక చేసుకోవాలన్నారు. ఆడదూడలకు ఎద సూది (వీర్యం) ఇవ్వడం ద్వారా ఆడ దూడలే పుడతాయని ఇట్టి విషయమై పశు సంవర్థక శాఖాధికారులను సంప్రదించాలని కలెక్టర్ రైతులకు సూచించారు.

జాతీయ మాంస పరిశోధన సంస్థ డైరెక్టర్ బర్బుద్ధే మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ అనుబంధ రంగాలలో అవగాహన నిమిత్తం కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నదని అన్నారు. జంతు వ్యర్థ పదార్థాల నిర్వహణ, సాంకేతికతల పై ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ శిక్షణ ఇస్తున్నామన్నారు. తెలంగాణ లో మాంసానికి మంచి డిమాండ్ ఉందని, ఆ దిశగా రైతులు గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకం పై దృష్టిపెట్టాలన్నారు.

కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ శరత్ చంద్ర మాట్లాడుతూ పరిశోధనా ఫలాలు రైతు సోదరులకు అందించాలనే ఉద్దేశ్యంతో కిసాన్ మేళా ఏర్పాటు చేశామన్నారు. వివిధ శాఖల స్టాల్స్ ద్వారా ప్రేరణ కల్పిస్తున్నామని, పాలు, పాల ఉత్పత్తి ప్రాసెసింగ్ ద్వారా ఆదాయం ఎలా మెరుగుపరచుకోవాలో అవగాహన కలిగిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో కోరుట్ల పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్, యెన్ఆర్ఏంఐ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి సింహా రావు, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, విజయ డైయిరీ డిప్యూటీ డైరెక్టర్ నంద కుమారి, కళాశాల విద్యార్థులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు.


Similar News