ప్యాడి కుంభకోణం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే పై కేసు

నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యేపై ప్యాడి కుంభకోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-02-15 16:17 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యేపై ప్యాడి కుంభకోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న ఎఫ్ఐఆర్ నమోదు కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లాలో రైసుమిల్లులు 2021-22 తో పాటు 2022-23 సీజన్లలో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకుని వాటిని మర ఆడించి బియ్యంను ఎఫ్ సీఐకి అప్పగించాల్సి ఉండగా వాయిదాలు కోరుతూ ధాన్యాన్ని మాయం చేశారనేది బహిరంగ రహస్యమే. నిజామాబాద్ జిల్లాలో పలు రైసుమిల్లు రూ.111 కోట్ల ధాన్యాన్ని గయాబ్ చేసినట్లు గతంలోనే విజిలెన్స్ తనిఖీలలో బట్టబయలైంది. మాజీ ఎమ్మెల్యే షకీల్ అమెర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన రైసుమిల్లులో ధాన్యం పక్కదారి పట్టడంతో అక్కడ తనిఖీలు చేసి అధికార యంత్రాంగం రూ. 25 కోట్ల జరిమానా విధించిన విషయం తెల్సిందే. దానిని చెల్లిస్తానని వాయిదా కోరిన ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో అధికార యంత్రాంగం రెవెన్యూ రికవరీ యాక్ట్ తో పాటు క్రిమినల్ కేసు నమోదుకు సిద్దమైంది.

నిజామాబాద్ జిల్లాలో ధాన్యం తీసుకుని మర ఆడించకుండా సీఎంఆర్ గా ఎఫ్ సీఐకి అప్పగించని యాజమాన్యాలపై జిల్లా అధికార యంత్రాంగం దూకుడు పెంచింది. జిల్లాలో దాదాపు రూ. 135 కోట్ల ధాన్యం తాలుకు డబ్బులను వసూళ్లకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కు సిద్ధపడిన విషయం తెల్సిందే. 2021-2 ఖరీఫ్, 2022-23 రబీ సీజన్‌లో పౌర సరఫరాల శాఖ నుంచి ధాన్యం తీసుకుని ఇప్పటి వరకు సీఎంఆర్ గా అప్పగించని మిల్లులపై అధికార యంత్రాంగం కొరడా ఝళిపించడం మొదలుపెట్టింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కోరేగాం గ్రామంలోని ఆర్కం ఇండస్ట్రీస్ యజమాన్యం రూ.52,65,51,916.90 కోట్ల ధాన్యం తీసుకుని ఇప్పటి వరకు రెండు కోట్లు ధాన్యం మాత్రమే తిరిగి అప్పగించినట్లు గత నెల 29న సివిల్ సప్లై అధికారులు, పోలీసు అధికారులు స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో తనిఖీలలో వెల్లడయింది.

అందుకు సంబంధించిన ధాన్యం కూడా లేకపోవడంతో సంబంధిత యజమాన్యం రూ.50, 65,51,916.90 ధాన్యం ను పక్కదారి పట్టించినట్లు తనిఖీలలో తేల్చింది. ఈ మేరకు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ద్వారా ఫిర్యాదు చేయించారు. ఈ నెల 10న జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ కోటగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సాయిరాం, వసీం, షకీల్ అమెర్( బోధన్ మాజీ ఎమ్మెల్యే), మరికొందరిపై 28/2024 నెంబర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 406, 409, 417,420 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఇటీవల బోధన్ మండలంలోని మరొక మిల్లర్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత రైస్ మిల్ యజమాని రూ. 20 కోట్ల మేర ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. తాను తీసుకున్న ధాన్యాన్ని ఇతర మిల్లులకు ట్రాన్స్ ఫర్ చేసినట్లు పత్రాలు సమర్పించిన ఓక్క ధాన్యం గింజను కూడా మిల్లర్లు ఇవ్వకుండా దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు మిల్లర్ కోసం గాలిస్తుండగా అతడు కొన్ని రోజులుగా తప్పించుకుతిరుగుతున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో గుర్తించి పట్టుకువచ్చి మింగిన ధాన్యంను కక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 10 రైస్ మిల్లర్ల పై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. దాదాపు 23 మంది మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలిసింది. గత నెల చివరి వరకు సీఎంఆర్ అప్పగించాల్సి ఉండగా ఎఫ్‌సీఐ మరో నెల రోజుల పాటు గడువు పోడించిన విషయం తెలిసిందే. ఐతే మిల్లర్ల వద్ద అసలు ధాన్యం లేకపోవడంతో వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టారు. జిల్లాలో ప్రతి ఏడాది ధాన్యం తీసుకుని వాటిని మిల్లింగ్ చేయకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్న మిల్లర్లు రియల్ దందా కోసం ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తెలంగాణ సరిహద్దులో మరికొందరు మహరాష్ట్రలో మిల్లుల నిర్మాణాలు చెప్పినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే షకిల్ అండతో మిల్లర్లు పౌరసరఫరాల శాఖ నుంచి ధాన్యం తీసుకుని ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లలో ఇప్పుడు గుండె దడ మొదలైంది.


Similar News