భద్రాద్రిలో బీఆర్ ఎస్ విజయం

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయకేతనం ఎగురవేశారు.

Update: 2023-12-03 09:08 GMT

దిశ, భద్రాచలం : భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయకేతనం ఎగురవేశారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పై 6319 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించారు. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలలో మొత్తం 1,48,661 ఓట్లు ఉండగా 1,17,447 ఓట్లు పోలయ్యాయు. వీటిలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు 52,612 ఓట్లు సాధించి గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య 46,293 ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.

     ప్రస్తుతం గెలుపొందిన వెంకట్రావు 2018 ఎన్నికలలో పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. పట్టణంలో ప్రముఖ వైద్యులు కావడం, గతంలో ఓడిపోయారానే సానుభూతి, సేవా భావం కలిగి ఉండటంతో వెంకట్రావుకు భద్రాద్రి ప్రజలు పట్టం కట్టారు. ఇది బీఆర్ ఎస్ విజయం అనేకంటే, అభ్యర్థి విజయం అని చెప్పాలి. భద్రాచలం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు విస్మరించినా, భద్రాచలం లో బీఆర్ ఎస్ అభ్యర్థికి పట్టం కట్టడం విశేషం. తాజా ఎమ్మెల్యే వీరయ్య ప్రతిపక్ష కాంగ్రెస్ లో ఉండి భద్రాద్రి అభివృద్ధికి నిధులు తీసుకురాకపోవడం వలన వీరయ్య ఓటమి చవిచూశారు. తెల్లం వెంకట్రావు మొట్ట మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు.

అనవాయితీ తప్పలేదు

రాష్ట్రంలో అధికారం చేపట్టే పార్టీకి చెందిన అభ్యర్థి భద్రాచలం లో గెలవకపోవడం ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వస్తున్న అనవాయితీ. అలాగే ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికలు నుండి, ఈ ఎన్నికల వరకు మూడు ఎన్నికలలో ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు మాత్రమే బీఆర్ ఎస్ గెలుచుకుంటుంది.

కాంగ్రెస్ తీర్ధం తీసుకుంటారా..

భద్రాచలం లో గెలుపొందిన బీఆర్ ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పొంగులేటి అనుచరునిగా ఉన్న తెల్లం, పొంగులేటి తో పాటు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కానీ టిక్కెట్ రాదనే ఆలోచనతో మళ్లీ యూటర్న్ తీసుకుని బీఆర్ ఎస్ గూటికి వచ్చారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుండటంతో వెంకట్రావు కాంగ్రెస్ తీర్ధం తీసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. 


Similar News