BREAKING: ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆపరేషన్.. అల్ఫ్రజోలం కింగ్ అరెస్ట్

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు కల్తి కల్లులో వినియోగించే మత్తు పదార్థమైన అల్ఫ్రజోలం‌ను రవాణా చేసే కీలక వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-05-29 07:25 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు కల్తి కల్లులో వినియోగించే మత్తు పదార్థమైన అల్ఫ్రజోలం‌ను రవాణా చేసే కీలక వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు దశాబ్ధ కాలం తర్వాత ఉమ్మడి జిల్లాలో కల్లు డిపోలకు అల్ఫ్రజోలం రవాణా చేస్తుండగా నిందితుడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు.. మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ప్రధాన సూత్రధారి, గాంధారి మండల కేంద్రానికి చెందిన వ్యక్తికి అర కిలోకు పైగా అల్ఫ్రజోలం ఇస్తుండగా ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో కల్లు డిపోలకు కృత్రిమ రసాయన కల్లు తయారీలో వినియోగించే క్లోరోఫామ్, డైజోపాంతో పాటు అల్ఫ్రజోలం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అబ్బాస్ ఆలీ హయాంలోని ఒకసారి రామారెడ్డికి చెందిన పేరు మోసిన స్మగ్లర్ పట్టుబడ్డట్లు రికార్డులు కూడా ఉన్నాయి. తన వ్యాపారాన్ని ఉమ్మడి జిల్లాతో పాటు పోరుగు జిల్లాలకు విస్తరించి హైదరాబాద్ వరకు వ్యాపార సామ్రాజ్యాన్ని సందరు వ్యక్తి విస్తరించుకున్నాడు. పార్టీలకు అతీతంగా కల్లు సొసైటీలో ఉన్న రాజకీయ నాయకులు కల్లు డిపోలపై దాడులు జరగకుండా ప్రధాన సూత్రధారులు దొరక్కుండా మత్తును ఇచ్చే కల్లును తయారు చేస్తున్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ప్రతిరోజూ రూ.కోటి పైగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయంటే దందా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టుబడిన మత్తు పదార్థాల రవాణా సూత్రధారికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన ఒక మాజీ ప్రజాప్రతినిధికి బంధువు.

రెంజల్ మండలంలో కల్లు డిపో నిర్వహిస్తున్న మాజీ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ దగ్గర బంధువు అని తెలిసింది. ఉమ్మడి జిల్లాలో కల్తీ కల్లు మాఫియా‌ను శాసిస్తున్న రాజకీయ నాయకులు మంగళవారం రాత్రి నుంచి ప్రధాన సూత్రధారుడిని కేసు నుంచి తప్పించే పనిలో పడ్డారు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ లీడర్ ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలిసింది. హేరాయిన్, కొకెయిన్ కంటే అత్యంత మత్తు పదార్థమైన అల్ఫ్రజోలం వినియోగం రాష్ట్ర రాజధాని తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో టీఎస్ న్యాబ్ అధికారులతో పాటు ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దానిపై దృష్టి సారించడంతోని ప్రధాన సూత్రధారి పట్టుబడినట్లుగా తెలిసింది.


Similar News