రక్త మోడుతున్న రైలు పట్టాలు

నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ లపై జరుగుతున్న ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి.

Update: 2024-06-28 14:10 GMT

 దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్ లపై జరుగుతున్న ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైం రేట్ విపరీతంగా పెరిగింది. నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 36 రైల్వే స్టేషన్ లు ఉండగా పూర్వపు ఆదిలాబాద్ సగం, పూర్వపు కరీంనగర్ సగం, మెదక్ జిల్లాలో సగం రైల్వే స్టేషన్ ల పరిధిలోని ట్రాక్ నిజామాబాద్ రైల్వే పరిధిలోకి వస్తాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్క జూన్ మాసంలోనే ఈ నెల 27 వరకు 15 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనవరి నుంచి జూన్ వరకు దాదాపు 80 మంది రైలు కింద పడి, రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు.

రైల్వే పోలీస్ స్టేషన్ 360 కిలోమీటర్ల పరిధిలో ఉంది. క్షణికావేశంలో కుటుంబ కలహాలు, మద్యం మత్తు కారణం ఏదైతే ఏమిటి ఆత్మహత్యలు మాత్రం పెరిగిపోతున్నాయి. రైల్వే ట్రాక్ లపై జరుగుతున్న ఆత్మహత్యలను నివారించాలంటే వందల మందికి ప్రాణాపాయం పొంచి ఉంటుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలోని జరుగుతున్న ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. దాదాపు జనవరి నుంచి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో 140 క్రైమ్ కేసులు నమోదయ్యాయి. అందులో 80కి పైగా సూసైడ్ కేసులే ఉండడం ఇప్పుడు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ట్రాక్ కొత్త రికార్డును నెలకొల్పింది. నిత్యం ఏదో ఒక చోట లేదా వారానికి ఒకటి, రెండు కచ్చితంగా ఇలాంటి కేసులే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు రైల్వే పరిధిలో ఎలాంటి యాక్సిడెంట్ కేసులు నమోదు కాకున్నా ఆత్మహత్య కేసులు మాత్రం రైల్వే పోలీసులకు తలనొప్పిగా మారాయి. కొన్ని కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ట్రేస్ చేయాలగలుగుతున్నా మరికొందరిని మాత్రం గుర్తించలేకపోతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల డెడ్ బాడిలను ఆసుపత్రులలో కొద్ది రోజుల వరకు ఉంచి వారి ఫోటోలను ప్రచురణ నిమిత్తం పంపడం, సమయం మించిపోతే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయించడం నిత్యతంతుగా మారింది. ఇతర ప్రాంతాల్లో రైల్వే పోలీస్ స్టేషన్ లు ఉన్నప్పటికీ కేవలం 360 కిలోమీటర్ల పరిధిలో ఆత్మహత్యలు పెరగడానికి వేర్వేరు కారణాలున్నాయని చెబుతున్నారు. కొన్ని మానసికంగా, మరికొన్ని వేధింపులకు, మరికొన్ని వ్యక్తిగత కారణాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈ విషయంలో ముందుగానే గుర్తిస్తే ఆత్మహత్యలను నిరోధించవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

క్రైమ్ రేటును తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం : రైల్వే ఎస్సై సాయి రెడ్డి


నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా క్రైమ్ రేటు పెరిగింది. చాలిచాలని సిబ్బందితో నేరాల నియంత్రణకు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాం. అందులో సింహాభాగం ఆత్మహత్యల కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముందుగానే ఆత్మహత్య ప్రయత్నించే వారిని గుర్తిస్తే ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. ఇప్పటి వరకు ట్రాక్ ల వెంబడి జరుగుతున్న ఆత్మహత్యల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నాం.


Similar News