నగదు రహిత లావాదేవీల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ భారత్
నగదు రహిత లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ అని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గం ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు.
దిశ, భిక్కనూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెచ్చిన ఆర్థిక సంస్కరణల వలన ప్రపంచంలోనే భారతదేశం నగదు రహిత లావాదేవీల్లో నెంబర్ వన్ గా నిలుస్తోందని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని జంగంపల్లి, అంతంపల్లి, లక్ష్మీదేవుని పల్లి, కాచాపూర్, అయ్యవార్ పల్లి, పెద్ద మల్లారెడ్డి, కంచర్ల, ఇస్సన్నపల్లి, మల్లు పల్లి, సిద్ధ రామేశ్వర నగర్, గుర్జకుంట,ర్యా గట్ల పల్లి, రామేశ్వర్ పల్లి, రాత్రి భిక్కనూరు మండల కేంద్రంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇలా అన్ని రంగాల్లో భారతదేశం ముందుకు దూసుకుపోతుందన్నారు. గత మూడు సంవత్సరాలుగా దేశంలోని 80 కోట్ల మందికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ఈ విధంగా దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తుంటే ఇది గిట్టని ప్రతిపక్ష పార్టీలు, తమ ఉనికిని కాపాడుకోవడం కోసం లేనిపోని విమర్శలు చేస్తూ మోడీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. మిగులు బడ్జెట్ తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు నాడు జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇక్కడి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడాను గమనించి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశాడు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.