వరదలకు తెగిన భవానీపేట్ పోతారం బ్రిడ్జ్ అప్రోచెస్...

రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మాచారెడ్డి మండలంలో ఒక వంతెన, ఆరు కాజు వేలు కోతకు గురయ్యాయి.

Update: 2024-09-03 17:21 GMT

దిశ, మాచారెడ్డి : రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మాచారెడ్డి మండలంలో ఒక వంతెన, ఆరు కాజు వేలు కోతకు గురయ్యాయి. ప్రధానంగా భవానీపేట్ పోతారం గ్రామాల మధ్య గల వంతెన అప్రోచెస్ వరదలకు కొట్టుకుపోవడంతో మూడు గ్రామాలకు ప్రయాణ సౌకర్యం నిలిచిపోయింది. భవానిపేట్, పోతారం, ఇసాయిపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనకు అవతలి వైపు గల భవానిపేట గ్రామ రైతుల పొలాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పాడి పశువుల రైతులు భవానీపేట్ నుంచి పాల్వంచ మర్రి, ఇసాయిపేట్, పోతారం మీదుగా వారి చేనులలోకి వెళ్లుతుందని వాపోయారు.

పొంగిన వాగు ప్రవాహంలో భారీ వృక్షాలు కొట్టుకు వచ్చి బ్రిడ్జికి తెట్టె పెట్టినట్టు తట్టుకోవడంతో ప్రవాహం మధ్యలో నుంచి కాకుండా బ్రిడ్జికి రెండు చివరల నుంచి వెళ్లడం వల్ల అప్రోచ్ లు కొట్టుకుపోయాయని స్థానికులు వివరించారు. ఆరేపల్లి - సింగరాయపల్లి, వాడి - పర్దీపేట, దేవునిపల్లి, వెల్పుగొండ - దోమకొండ, ఇసాయిపేట్- ఎల్లంపేట వెళ్లే రోడ్ల పై గల కాజు వేలు వరదలకు కోతకు గురయ్యాయి. ఆయా గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులకు ప్రతిపాదనలు తయారు చేయించి వెంటనే పునరుద్ధరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


Similar News