ష్...గప్ చుప్.. జోరుగా బినామీ రైస్ మిల్లుల దందా

దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు రైస్ మిల్లర్లు లేవి బియ్యం సేకరణ పంచుకుంటున్నారు.

Update: 2022-10-03 14:03 GMT

దిశ, బాన్సువాడ : దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు రైస్ మిల్లర్లు లేవి బియ్యం సేకరణ పంచుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకరి పేరిట కేటాయింపులు చేసుకొని, మరొక మిల్లులో మర పట్టిస్తున్నారు. దొడ్డిదారిలో తెలివిగా బిల్లులు పొందుతూ, అందినంత సొమ్ము చేసుకుంటున్నారు. ఈ అక్రమ వ్యవహరంలో పెద్ద రైస్ మిల్లర్ల ఆగడాలు రోజు రోజుకు శ్రుతి మించుతున్నాయి.

జిల్లాలో సుమారు 6.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇందులో సుమారు 4.90లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉండగా, వీరు ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా ఉచిత రేషన్ పొందుతున్నారు. వీరందరికి ఉచిత బియ్యం పంపిణీకి ఖరీఫ్, రబీ సీజన్ లో వరి ధాన్యం సేకరించి మిల్లర్లకు ఇస్తుంది.

సేకరించిన ధాన్యానికి సరిపడా డబ్బులు రైతులకు చెల్లిస్తుంది. రైస్ మిల్లర్లు తిరిగి ఇచ్చిన లేవి బియ్యాన్ని, ప్రజలకు రేషన్ రూపంలో అందిస్తుంది. ఈ కోవలో 2021-22 వానాకాలం పంట సీజన్ కు సంబంధించి 458 కొనుగోలు కేంద్రాల ద్వారా 89,415 మంది రైతుల నుంచి 6,86,155 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ధాన్యం విలువ మేరకు రైతులకు రూ.1340.05కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో వేసింది.

అలాగే యాసంగి పంటకు సంబంధించి 460కొనుగోలు కేంద్రాల ద్వారా 81,239మంది రైతుల నుంచి 6,35,905 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు రూ.1238.59కోట్లు వారి బ్యాంక్ ఖాతాల్లో వేసింది. ఇలా సేకరించిన ధాన్యం సుమారు 200పైబడి ఉన్న రైస్ మిల్లర్లకు ఇచ్చి, గడువులోగా బియ్యం రూపంలో ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది.

కిలోకు నిర్ణీత మొత్తం మిల్లర్లకు కమీషన్ చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ ఒప్పుకుంది. ఇక్కడే మిల్లర్లు అక్రమాలకు తెరలేపారు. కమీషన్ కోసం మూసీ ఉన్న రైస్ మిల్లుల పేరు మీద సైతం ఒప్పందం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మిల్లులను సైతం ఒప్పందంలో భాగం చేశారు.

దొడ్డిదారిన కమీషన్ పొందేందుకు పెద్ద మిల్లర్లు ఇలా కుట్ర చేశారు. అక్రమంగా లేవి బియ్యం సేకరణకు అనుమతి పొంది, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగిస్తున్నారు. శాఖలోని ఇంటి దొంగలకు ఇది తెలిసినా, లంచాల మత్తులో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ డివిజన్ల పరిధిలో బినామీ రైస్ మిల్లుల దందా జోరుగా సాగుతోంది. పేరుకు ఒకరిపైన అలాట్మెంట్ జరిగిన మరొకరు మిల్లింగ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా వర్ని మండలంలోని ఓ రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని, మరో రైస్ మిల్లుకు తరలిస్తుండగా కొందరు పట్టుకున్నారు. దీంతో సంబంధిత యజమాని వాళ్లను ప్రాధేయపడి గండం గట్టెక్కారు.

బోధన్ కు చెందిన ఓ ముఖ్య ప్రజా ప్రతినిధి సంబంధీకుల మిల్లులో సైతం ఈ తరహా మోసం యదేచ్చగా జరుగుతోంది. అక్రమ దందా కోసమే కొత్తగా వీరు మిల్లులు సైతం స్థాపించడం విశేషం. అక్రమాలకు పాల్పడుతున్న ప్రతి మిల్లులో బినామీ మిల్లులకు కేటాయించిన వరి నిల్వల లెక్కలు ఉండటం లేదు. సరుకు అమ్మేసి ఉన్నట్టు చూపిస్తున్న దాఖలాలు ఎక్కువే. అక్రమ తనఖాలోన్లు పొందుతున్న మిల్లర్లు ఉన్నారు. ఈ కారణాలతోనే మిల్లు ఒప్పందం ప్రకారం లేవి బియ్యం సకాలంలో ఇవ్వలేక పోతున్నారు.

ప్రజా ప్రతినిధులకు పెద్ద మొత్తంలో మిల్లర్లు ఇస్తున్న ప్యాకేజీలకు వాళ్ళు సైతం కిక్కురుమనకుండా, కుక్కిన పెనులా పడి ఉంటున్నారు. కేంద్ర బృందం తనిఖీల్లో ఈ విషయాలన్ని తేటతెల్లం కూడా అయ్యాయి. అయినా జిల్లా అధికార యంత్రాంగం దీనిపై నోరు మెదపక పోవడం విమర్శలకు తావిస్తోంది. ఇకనైనా రైస్ మిల్లర్ల ఆట కట్టించాలని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News