ఎన్నికలకు ముందే పోలీస్ శాఖలో బదిలీల పర్వం

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది.

Update: 2024-01-29 14:30 GMT

దిశ, ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖలో ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయింది. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన అధికారులను తప్పించే పని కొనసాగుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నియమితులైన కల్పేశ్వర్ కొనసాగుతుండగా కామారెడ్డి జిల్లాకు సింధూ శర్మ నియామకమైన విషయం తెల్సిందే. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు ఐపీఎస్‌ల విషయంలో ఎలాంటి బదిలీల్లో స్థానచలనం కల్పించలేదు. కానీ తర్వాత క్యాడర్‌ను మార్చే పని జోరుగా సాగుతుంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో సీఐల బదిలీ ప్రక్రియ జోరందుకుంది.

గత వారం భీంగల్ సీఐని తొలుత బదిలీ చేసి బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉమ్మడి జిల్లాలో 22 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్‌‌ను బదిలీ చేశారు. అది చాలదన్నట్లు ఆదివారం ఇద్దరు సీఐలను బదిలీ చేశారు. సోమవారం నలుగురు సీఐ లకు స్థానచలనం కలిగించారు. జిల్లాలో రేపోమాపో మరికొంత మంది సీఐ లకు స్థానచలనం కల్పిస్తారని పోలీసు శాఖలో చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పెద్దలు తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకు కారణం లేకపోలేదు. గడిచిన ప్రభుత్వ హయంలో నియమితులైన అధికారులు ఖాకీ అధికారుల కన్నా గులాబీ కండువా కలిగిన అధికారులుగా చలామణి అయ్యారన్న అపవాదు ఉంది. అంతేగాకుండా సిఫారసు లెటర్లతో వచ్చిన వారు అధికార పార్టీ ఎమ్మెల్యేల మాటను జవదాటలేదు.

పోలీస్ స్టేషన్లలో కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న ఎమ్మెల్యేల సిఫారసు లేనిదే కేసులు కట్టలేదని వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లాలో పలువురు అధికారులను ఉద్దేశించి ఆనాటి పీసీసీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడటంతో జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నలుగురు శాసనసభ్యులు తమ నియోజకవర్గాల్లోని పోలీసు అధికారులను మార్చాలని ప్రభుత్వానికి విన్నవించుకుని మరీ మార్చడం విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా గెలువని చోట ఐజీ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు సమాచారం.

బదిలీల ప్రక్రియలో భాగంగా సీఐలను ముందుగా ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ఎస్సైలను బదిలీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆదివారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నలుగురు ఎస్సైలకు స్థానచలనం కల్పించారు. ఆదివారం జరిగిన ఒక సీఐ బదిలీని సోమవారం మార్చివేశారు. అంతేగాకుండా ఒకప్పుడు లూప్ లైన్ లో ఉన్న వారిని ప్రాధాన్యత కలిగిన పోస్టులను ఇప్పించి మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అంతేగాకుండా కాంగ్రెస్ హయంలో పని చేసిన పలువురు అధికారులను ఏరికోరి తెచ్చుకునే పని ప్రస్తుతం కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలోని పలువురు ఏసీపీలు, డీఎస్సీలను మారుస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత డాటా ప్రభుత్వం వద్ద ఉందని రేపోమాపో ఆ ఉత్తర్వులు వెలువడుతాయని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జిల్లాలోని గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారందరినీ మార్చివేసే ప్రక్రియ జరుగుతుందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.


Similar News