ఆ కాలంలో నియోజకవర్గ నిధులు 50 లక్షలే : సభాపతి పోచారం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాక ముందు నియోజకవర్గానికి నిధులు 50 లక్షలు మాత్రమే ఇచ్చే వారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2023-03-10 13:57 GMT

దిశ, బాన్సువాడ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాక ముందు నియోజకవర్గానికి నిధులు 50 లక్షలు మాత్రమే ఇచ్చే వారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఒక్కో నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు వస్తున్నాయని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని రుద్రూరు మండలం సులేమాన్ నగర్ లో శుక్రవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 కంటే ముందు 2014 తరువాత తెలంగాణ రాష్ట్రం ఎలా మార్పుచెందింది అనేది గమనించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రతి ఏడాది ఒక్కో శాసనసభ్యునికి రూ. 50 లక్షల నియోజకవర్గ అభివృద్ధి నిధులు వచ్చేవని, కేసీఆర్ సీఎం అయ్యాక మొదట రూ. 3 కోట్లు, తరువాత రూ. 5 కోట్లకు పెంచారన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్కో గ్రామంలో అభివృద్ధి పనుల కోసం 2 నుండి 5 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయన్నారు. 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం, మౌళిక వసతుల కోసం రూ. 1100 కోట్లు ఖర్చు చేశామన్నారు. 7000 ఇళ్ళు పూర్తయి, లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశామన్నారు. మిషన్ భగీరధ పథకంలో భాగంగా సింగూరు - జుక్కల్ సెగ్మెంట్ నిర్మాణం కోసం రూ. 2000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

ఇందులో జుక్కల్, బాన్సువాడ, బోదన్ అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 3 మండలాలు ఉన్నాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 60,797 గృహాలకు మిషన్ భగీరధ ద్వారా తాగునీరు అందిస్తున్నామని రూ.150 కోట్లతో నిజాంసాగర్ కాలువల ఆధునీకరణ రూ.300 కోట్లతో మిషన్ కాకతీయ పనులు, రూ.120 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం, రూ.106 కోట్లతో జాకోర, చందూరు, చింతకుంట ఎత్తిపోతల పథకం, రూ.175 కోట్లతో మంజీర నదిపై చెక్ డ్యాంల నిర్మాణం, రూ.150 కోట్లతో నియోజకవర్గంలో నూతన ఎత్తిపోతలపథకాల నిర్మాణం చేపట్టామన్నారు.

రైతుబంధు పథకం ద్వారా నియోజకవర్గంలోని 66,670 మంది రైతులకు సంవత్సరానికి రూ.100 కోట్ల నగదు అందుతున్నదని, గత 6 సంవత్సరాలలో మొత్తం రూ.600 కోట్లు రైతులకు పంపిణీ చేశామన్నారు. విమర్శలు చేసే వారు వారి పార్టీల ప్రభుత్వాలు ఉన్నరాష్ట్రాలలో ఈ పథకాలను అమలు చేసి చూపించాలన్నారు. అంతకు ముందు రూ.9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. రూ. 20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన, మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.23. 16 లక్షలతో జెడ్పీహెచ్ఎస్ లో కల్పించే మౌళిక వసతుల కల్పనకు శంకుస్థాపన, రూ..10 లక్షల ఆరోగ్యఉప కేంద్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News