బీడీ కార్మికులకు రూ.4016 జీవనభృతి ఇవ్వాలి

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది బీడీ కార్మికులకు షరతులు లేకుండా రూ.4016 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజంపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Update: 2024-11-07 14:56 GMT

దిశ, రాజంపేట : రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది బీడీ కార్మికులకు షరతులు లేకుండా రూ.4016 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాజంపేట మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్. సిద్దిరాములు మాట్లాడుతూ గత 15 రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో వేలాదిమంది బహుజన కులాలకు చెందిన బీడీ కార్మికులు జీవన భృతి చెల్లించాలని ఆందోళనలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీడీ కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రూ.4016 జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.

    బీడీ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య మాట్లాడుతూ నేడు బీడీ కార్మికులకు ఈ మాత్రం హక్కులు ఉన్నాయంటే అది బీడీ కార్మికుల సమర శీల పోరాటాల వల్లనే తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దయదల్చి ఇచ్చినవి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి రూ.4016 జీవన భృతి ఇవ్వాలని, లేకుంటే స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు.

    తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ 2014 ఫిబ్రవరి 28 కటాఫ్ తేదీని తొలగించి బీడీ పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్కరికి జీవన భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్ అనిల్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్ టీయూ శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. అనసూయ, రాష్ట్ర నాయకులు వెంకటలక్ష్మి, కె.లింగం, బీఎల్ టీయూ నాయకులు నాంపల్లి, బీడీ టేకేదార్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం. భాస్కర్, పంచాక్షరి, బాల్ కిషన్ పాల్గొన్నారు. 


Similar News