బోధన్ ఎమ్మెల్యే షకీల్ కు నిరసన సెగ

బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ కు నియోజకవర్గంలో నిరసన సెగ రోజురోజుకు పెరుగుతోంది.

Update: 2023-11-22 12:20 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ కు నియోజకవర్గంలో నిరసన సెగ రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం ఎడపల్లి మండలం ఎఆర్పీ క్యాంప్, బ్రాహ్మణపల్లి, జైతాపూర్ లలో ఎమ్మెల్యేను గ్రామాలలోకి ప్రచారానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సాటాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీస్ లు లాఠీ చార్జ్ చేసి అందరిని చెదరగొట్టారు. షకీల్ బోధన్ నుంచి ఎఆర్పీ క్యాంపులకు, బ్రాహ్మణ పల్లిలో ప్రచారానికి రాగా గ్రామస్తులు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలపై నిలదీశారు. గ్రామంలో ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. గ్రామానికి ఇచ్చిన హామీలు నెరవేర్చిన తరువాతనే ప్రచారానికి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మణ పల్లిలో బీఆర్ఎస్ నాయకులు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలతో గొడవకు దిగారు. ఈ సంఘటనలో ఎడపల్లి మండల పార్టీ అధ్యక్షులు శ్రీరాం, ఎడపల్లి సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ లకు గాయాలు అయ్యాయి.

    ఒక మహిళ విసిరిన చెప్పు షకిల్ అమేర్ ఉన్న కారుపై పడింది. గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ నేత, మాజీ జెడ్పీటీసీ పులి శ్రీనివాస్ హస్తం ఉందని అతనిపై అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ కార్యకర్తలు తోడై బీఆర్ఎస్ పై ఎదురు దాడి చేశారు. దాంతో సాఠాపూర్ గ్రామం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంగళవారం రెంజల్ మండల కేంద్రంలో, ధూపల్లి గ్రామంలోనూ షకీల్ కు నిరసన సెగ తగిలింది. గ్రామాలకు రోడ్లు వేసేందుకు ఎనిమిది సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన నిధులు విడుదల చేయలేదని రోడ్లు వేయకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చారని అక్కడ రెండు గ్రామాల ప్రజలు నిలదీశారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కనీసం కొన్ని గ్రామాలకు ఎన్నడూ వెళ్లకపోవడంతోనే అక్కడ కూడా నిరసనలు ఎదురవుతున్నాయి. బోధన్ నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రతిపక్షాలపై ఉసిగొలుపుతూ ఉన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి.

ఓడిపోతున్నామనే కాంగ్రెస్ వాళ్లు దాడి చేయించారు

దిశ, బోధన్ : ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ ప్రచారంను అడ్డుకున్న ఘటనలో కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని షకీల్ అన్నారు. ఎడపల్లి మండల కాంగ్రెస్​ నాయకులు పులి శ్రీనివాస్, నారాయణ, జైతాపూర్ సర్పంచ్ రామ్ గోపాల్ రెడ్డి , బోధన్ కౌన్సిలర్ శరత్ రెడ్డి లు తన అనుచరులతో దాడి చేశారని తెలిపారు. సాటాపూర్ గేట్ వద్ద కాంగ్రెస్ నేత శరత్ రెడ్డి బీజేపీ యువకులతో కలిసి మైనారిటీ కి చెందిన యువకులను రూమ్ లో బంధించి దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాడి పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోని యెడల బీఆర్ఎస్ శ్రేణులతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఓడిపోతున్నామనే భయంతో సుదర్శన్ రెడ్డి ప్రీ ప్లాన్డ్ గా ఎడపల్లి సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరామ్ పై దాడి చేయించాడని, వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Similar News