బట్టాపూర్ క్వారీ బకాసురుడు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బట్టాపూర్ అక్రమ క్వారీ బకాసురుడు మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అని ఎంపీ అరవింద్ విమర్శించారు.

Update: 2023-11-22 11:21 GMT

దిశ, ఆర్మూర్ : బట్టాపూర్ అక్రమ క్వారీ బకాసురుడు మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అని ఎంపీ అరవింద్ విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ కి మద్దతుగా మెండోరా మండల కేంద్రంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బట్టాపూర్ క్వారీ తవ్వకానికి 10,000 క్యూబిక్ మీటర్లు అనుమతి తీసుకొని అక్రమంగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిపారని మండిపడ్డారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సుమారు 250 కోట్లు బట్టాపూర్ అక్రమ క్వారీలో దోచుకున్నాడని ఆరోపించారు. కేంద్రం అభివృద్ధి పనుల కోసం నిధులు పంపితే వాటిని కాజేసి, ఆర్అండ్​బీ శాఖ నుంచి అదనంగా డబుల్ బిల్లులు తీసుకున్నాడని ఆరోపించారు. తన తల్లి దండ్రుల పై మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అరవింద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తల్లి చనిపోతే ఆ చావును కూడా ఎన్నికల గురించి పబ్లిసిటీ చేసుకున్న మూర్ఖుడు ప్రశాంత్ రెడ్డి అని విమర్శించారు.

    ఇంతటి మూర్ఖున్ని, ఇలాంటి దొంగలను బాల్కొండ ప్రజలు తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసిందని విమర్శించారు. బాల్కొండలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో అతనికే తెలియదన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థి పార్టీలు మార్చుతాడని విమర్శించారు. తాను రైతులకు మాటిచ్చిన ప్రకారం ప్రధాని మోదీ పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డు ప్రకటించారని హర్షం వ్యక్తం చేశారు. బాల్కొండ బీజేపీ అభ్యర్థిగా మొట్టమొదటిసారి మహిళా అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ మీ ముందుకు వస్తున్నారని, నవంబర్ 30న జరిగే ఎన్నికలలో కమలం గుర్తుకు ఓటు వేసి అన్నపూర్ణమ్మను గెలిపించుకుంటే నియోజకవర్గంలో ఇంకా చాలా అభివృద్ధి పనులు చేస్కోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మెండోరా మండలం అధ్యక్షులు నడిపి సాయన్న, బీజేవైఎం అసెంబ్లీ కో-కన్వీనర్ గంగారెడ్డి, సాయి రెడ్డి, ముత్యం, రమేష్, రాజు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


Similar News