సిద్ధులగుట్ట ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్ట కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు చదును చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు.

Update: 2024-01-10 05:13 GMT

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్ట కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కొందరు వ్యక్తులు చదును చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్ట వెనుక 63వ జాతీయ రహదారి నిజామాబాద్ రోడ్డు పక్కన ధోబి ఘాట్ వద్ద మత్స్యశాఖ‌కు చెందిన భవనం ఉంది. ఈ భవనం పక్కన రాళ్లు, చెట్లతో సిద్ధులగుట్ట కు చెందిన ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలం ఖాళీగా ఉండటంతో అక్రమార్కుల కన్ను ఈ స్థలంపై పడింది. ఎలాగైనా ఖాళీగా ఉంది కాబట్టి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి పథకం వేశారు. ఈ స్థలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకున్నా రాత్రి వేళలో ప్రోక్లై‌యిన్‌తో రాళ్లను, చెట్లను తొలగించి చదును చేస్తున్నారు.

అటవీ శాఖ నుంచి అనుమతి లేకుండా చెట్లను తొలగించారు. మత్స్యశాఖ భవనం పక్కన విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొందరు చదును చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలు కోడై కూస్తున్నారు. సిద్ధులగుట్ట వెనుకబాగంలో ఉన్న ఈ స్థలాన్ని చదును చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న.. విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. జాతీయ రహదారి పక్కనే ఖాళీగా ఉన్న విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సర్వే చేయించి చదును చేసిన ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు.


Similar News