అండర్ 19 సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్మూర్ గురుకుల విద్యార్థులు ఎంపిక
ఈనెల 8 నుంచి 10 వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఆర్మూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఈనెల 8 నుంచి 10 వరకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఆర్మూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 1న ఉమ్మడి జిల్లా స్కూల్ గేమ్స్ అండర్ 19 సాఫ్ట్ బాల్ జట్టు ఎంపిక కోసం నిర్వహించిన పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్ తెలిపారు.
పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జట్టులో ప్రతి విద్యార్థి జట్టును ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేయాలన్నారు. వైస్ ప్రిన్సిపాల్ సాయన్న జేవీపీ దయాల్, సూపరింటెండెంట్ లక్ష్మి చక్రపాణి, వ్యాయామ ఉపాధ్యాయులు బి. జ్ఞానేశ్వర్, పీఈటీ కె. రాజేందర్, సాఫ్ట్ బాల్ కోచ్ నరేష్, పాఠశాల, కళాశాల బృందం, నాన్ టీచింగ్ స్టాఫ్ తదితరులు ఎంపిక అయిన విద్యార్థులను అభినందించారు.