గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంత రెడ్డి బాధ్యతల స్వీకరణ..
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంత రెడ్డి రాజా రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంత రెడ్డి రాజా రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదపండితుల ఆశీర్వచనాల మధ్య అంతరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి చైర్మన్ సీటులో కూర్చున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు, విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. పోటీ పరీక్షల కోసం గ్రంథాలయాల్లో సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఎందరో ఇప్పటి వరకు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని, మరెందరో వారి లక్ష్యానికి అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకుని అనుకున్న లక్ష్యాన్ని చేరారని సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రంథాలయాల్లో ఇంకా ఇప్పటికీ ఎన్నో సమస్యలున్నాయని, గత ప్రభుత్వం గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
గ్రంథాలయాల ప్రతిష్టను దెబ్బతీసిందని సుదర్శన్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం పై దృష్టి కేంద్రీకరించామని, ఇప్పటికే చాలా సమస్యలను పరిష్కరించామని ఆయనన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థకు గొప్ప పేరుందని, దాన్ని కాపాడుకుంటూ సంస్థను మరింత అభివృద్ధి చెందేలా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కొత్తగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్ అంతరెడ్డి పై ఉందన్నారు. ఆయనకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని సుదర్శన్ రెడ్డి అన్నారు. అందరి సహకారంతో జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డితో పాటు డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ తదితరులు హాజరై అంతరెడ్డి రాజరెడ్డిని అభినందించి శుభాకాంక్షలు అందజేశారు.