దిశ, కామారెడ్డి : ప్రతి భవన, ఇతర నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో శనివారం భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమంపై జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మిక చట్టం ప్రకారం భవన, ఇతర నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం విలువలో ఒక శాతం సెస్ వసూలు చేసి కార్మికశాఖకు సమర్పించాలన్నారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే పనులను నిర్ణయించేవారు, నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారులు ఒక శాతం లేబర్ చెస్ వసూలు చేసి కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాలన్నారు.
ఈ విధంగా వసూలు చేసిన సెస్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఉపయోగిస్తామన్నారు. కార్మికులు కార్మిక శాఖలో 110 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని, తద్వారా వారు అనేక బెనిఫిట్స్ పొందుతారని తెలిపారు. నమోదు అయిన వారు సహజ మరణం పొందితే లక్షా 30 వేల రూపాయల వరకు, ప్రమాదవశాత్తు మరణము పొందుతే 6 లక్షల 30 వేల రూపాయల వరకు వారి కుటుంబం లబ్ధి పొందవచ్చని, పాక్షిక వైకల్యం కలిగితే 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు పొందవచ్చన్నారు. కార్మికుని కుమార్తె వివాహానికి 30 వేల రూపాయలు, ప్రసూతి సహాయ పథకాలకు 30 వేల రూపాయల వరకు పొందవచ్చన్నారు. జిల్లా అధికారులు వారి వారి శాఖలలో నిర్మాణ పనులు జరిగినప్పుడు పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులకు అవగాహన కల్పించి కార్మిక శాఖలో కార్మికుల నమోదు జరిగేటట్టుగా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు, సిపిఓ రాజారాం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారితో పాటు ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.