డబుల్ బెడ్ రూమ్ లిస్టులో పేరు రాలేదని.. పెట్రోల్ పోసుకొని ట్యాంక్ ఎక్కిన యవకుడు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ కోసం ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు గ్రామస్తులు కుటుంబీకులు కిందికి దిగాలని కోరినా
దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ కోసం ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు గ్రామస్తులు కుటుంబీకులు కిందికి దిగాలని కోరినా వినిపించుకోకపోవడంతో కొద్దిసేపు అక్కడ ఆందోళన వాతావరణం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో 720 డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. వాటి పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేశారు. లక్కీ డ్రా పద్ధతిలో ఈరోజు లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టారు. అయితే కామారెడ్డి పట్టణంలో 5047 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా, 3 వేల 450 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. వీరందరికీ పది మందికి ఒకటి చొప్పన లక్కీ డ్రా తీసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అలాట్ చేయడంతో ఇల్చీపూర్ కు చెందిన సంతోష్ అనే వ్యక్తి మనస్థాపంతో పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కాడు.
డ్రాలో తన పేరు లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ వాటర్ ట్యాంక్ ఎక్కడంతో అడ్లూర్‌లో ఆందోళన నెలకొంది. గ్రామస్థులు, పోలీసులు సంతోష్ ను కిందకు దిగిరావాలని వేడుకుంటున్నారు. అయినా కిందకు దిగకపోవడంతో తహసీల్దార్ డబుల్ బెడ్ రూమ్ జాబితాలో బాధితుడి పేరు చేర్చడంతో కిందికి దిగాడు. ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ విధానంలో లక్కీ డ్రాపై అర్హులైన పేదవారు పెదవి విరిచారు. అర్హులైనవారికి కాకుండా అనర్హులైన వారికి పంపిణీ చేశారంటూ కామారెడ్డి పట్టణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. టేక్రియాల్, అడ్లూరు, దేవునిపల్లి, రామేశ్వర్ పల్లి తదితర గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కని వారు అధికారులపై శాపనార్థాలు పెట్టారు. అర్హులైన లబ్దిదారులు, లీస్ట్ లో పేరు దక్కనివారు నిరసనలు వ్యక్తం చేశారు.