వైద్యం వికటించి వ్యక్తి మృతి.. హాస్పిటల్ సీజ్

Update: 2024-08-24 11:40 GMT

దిశ, భిక్కనూరుః వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అయితే ఘటనకు కారణమైన ప్రైవేట్ ఆసుపత్రిని శనివారం భిక్కనూరు మండల కేంద్రంలో డిప్యూటీ డిఎంహెచ్ వో ప్రభు కిరణ్ ఆధ్వర్యంలో సీజ్ చేశారు. వైద్యం వికటించి పెరముల స్వామి మృతి చెందడాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ ఆశిష్ సాoగ్వాన్ ఆదేశాల మేరకు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ తోపాటు, భిక్కనూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యేమిమా వైద్య సిబ్బందితో కలసి ప్రైవేట్ ఆస్పత్రిని విజిట్ చేశారు. మెడికల్ షాపు నడిపే లైసెన్స్ హోల్డర్ అందుబాటులో లేకపోవడం, లైసెన్స్ ఉన్న క్యాండెట్ ఆస్పత్రిలో లేకపోవడం, ఆమె భర్త ట్రీట్మెంట్ చేసి, వ్యక్తి మృతికి కారకుడయ్యాడని మండిపడ్డారు. మెడికల్ షాపులో కూర్చొని మెడిసిన్ అందిస్తున్న చిన్నారి యువతిని ప్యారాసెటమాల్ అంటే ఏమిటో తెలుసా.. దానికి ఒక పేరు ఉంటదని అడగగా సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుంచి ఆర్ఎంపీలు, పీఎంపీలు సీజనల్ వ్యాధులకు సంబంధించి ఈ మూడు నెలల పాటు ట్రీట్మెంట్ చేయకుండా స్ట్రిక్ట్ గా ఆర్డర్స్ ఇష్యూ చేయాలని పక్కనే ఉన్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యేమిమా ఆదేశించారు.

కేవలం సాధారణ జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారికి మాత్రమే ట్రీట్మెంట్ చేయాలని, సీజనల్ వ్యాధులకు సంబంధించి ట్రీట్మెంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో ఆర్ఎంపీలు, పీఎంపీలు, ఎవరైనా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఏ మాత్రం భయపడకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లి క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని సూచించారు. సీజనల్ జ్వరాలతో బాధపడేవారు స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో డిప్యూటీ డిఎంహెచ్ వో ప్రభు కిరణ్ మాట్లాడుతూ వైద్యం పట్ల అవగాహన లేకుండా ట్రీట్మెంట్ చేసి వ్యక్తి మృతికి కారణం అయినందుకు గాను ఆసుపత్రిని, మెడికల్ షాపును సీజ్ చేసినట్లు చెప్పారు. సీజ్ చేసిన విషయం తెలియగానే మండల కేంద్రంలో ఉన్న మిగతా ప్రైవేట్ ఆసుపత్రులను మూసివేశారు. ఆయన వెంట పిహెచ్ ఎన్ రాణి, హెల్త్ అసిస్టెంట్ సతీష్ లు ఉన్నారు.


Similar News