చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి
లింగంపేట మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లవ్వ అనే మహిళకు చెందిన వరి పంట ప్రమాదవశాత్తు నిప్పట్టుకోవడంతో కాలి బూడిదైంది.
లింగంపేట మండలం కన్నాపూర్ లో ఘటన.. కౌలు రైతుకు తీవ్ర నష్టం
దిశ : లింగంపేట్ (నాగిరెడ్డిపేట్) : లింగంపేట మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన ఎరుకల ఎల్లవ్వ అనే మహిళకు చెందిన వరి పంట ప్రమాదవశాత్తు నిప్పట్టుకోవడంతో కాలి బూడిదైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీను అనే వ్యక్తి ఎరుకల ఎల్లమ్మకు చెందిన ఎకరం పంట పొలాన్ని కౌలుకు తీసుకొని యాసంగిలో వరి పంట సాగు చేశాడు. మరో రెండు రోజుల్లో వరి పంట కోయాలని అనుకున్నప్పటికీ మంగళవారం సాయంత్రం పంటకు నిప్పంటుకుని కాలి బూడిదైంది. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.25వేల పెట్టుబడి పెట్టి కౌలుకు తీసుకొని పంట సాగు చేస్తే పంట బూడిదైదంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయాన్ని గ్రామస్థులు వ్యవసాయ అధికారులకు సమాచారం అందించారు. ప్రభుత్వం బాధిత రైతును ఆదుకుని నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.