మినీ గురుకులంలో పాముల కలకలం..

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని మినీ గురుకులం పాఠశాల ఆవరణ అంతా పరిశుభ్రంగానే ఉంటుంది కానీ పాములు ఎలా వచ్చాయన్నదే ప్రశ్నార్ధకంగా మారింది.

Update: 2023-07-06 14:34 GMT

దిశ, మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలోని మినీ గురుకులం పాఠశాల ఆవరణ అంతా పరిశుభ్రంగానే ఉంటుంది కానీ పాములు ఎలా వచ్చాయన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. మినీ గురుకులంలో విద్యార్థినిలు పాములతో సహవాసం చేయాల్సి రావడం అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనంగా మారింది. బుధవారం రాత్రి నిఖిత అనే అమ్మాయి డిన్నర్ చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురైంది. దీంతో గురుకులంలోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. గురుకులంలో డ్యూటీలో ఉన్న టీచర్లు అప్రమత్తమై అంబులెన్స్ లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పాప పరిస్థితిని పరీక్షించిన వైద్యులు విష రహిత పాము కాటేసిందని పాపకేమి అపాయం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

చుట్టూ ప్రహరీ గోడ ఉన్నప్పటికీ పరిసరాలు చెట్లు, పొదలు పక్కనే పొలాలు ఉండడంతో పాములు గురుకులం భవనంలోకి చేరినట్లుగా అనుమానిస్తున్నారు. గురుకులంలో పాముల కలకలం గ్రామంలో తెలవడంతో స్థానికులు వచ్చి రెండు పాములను చంపేశారు. వరండా పై పరిచిన పాలిష్ బండ కింద ఉన్న రంద్రాలలోనే పాములు నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్క సిమెంట్ బ్యాగుతో ఆ రంద్రాలను మూసేస్తే విద్యార్థినులకు పాముల బెడద తప్పుతుందని తెలిపారు. నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా కేటాయిస్తారని అందుకే తాము ఆ పని చేయలేకపోతున్నట్లు తెలిపారు. ఎలాంటి నిర్వహణ చేయకపోవడం వల్లనే పాములతో సహవాసం చేయాల్సి వస్తుందని పరిస్థితిని బట్టి తెలుస్తుంది.

గురుకులంలో ఒక హెచ్ఎం పోస్ట్ ఉండాల్సింది డిప్యూటేషన్ పై అధికారులు పంపిస్తూ గురుకులం పై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ లో నియమితులైన ఉపాధ్యాయులే అన్ని బాధ్యతలు నిర్వర్తించడం శోచనీయమని వాపోయారు. గురుకులం కు వెళ్లేదారి అధ్వానంగా మారింది. రాత్రి షిఫ్టుల్లో పనిచేసే గురుకులం సిబ్బందికి ఆ మార్గాన రావాలంటే భయమేస్తుందని వాపోయారు. స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలకు ఆ రోడ్డుపై స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని వివరించారు. మండల విద్యాధికారి కామారెడ్డి నియోజకవర్గానికి ఒక్కరే ఉండడంతో ఆయన పర్యవేక్షణ శూన్యం అనే చెప్పాలి. మినీ గురుకులాలాల్లో నిరంతర పర్యవేక్షణ లోపం కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి పాములు తేళ్ళు వంటి విష పురుగుల బెడద నుంచి రక్షించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News