ఫోన్ టాపింగ్, కాలేశ్వరం అంశాలపై కేసీఆర్, రేవంత్ ల మధ్య చీకటి ఒప్పందం
ఫోన్ టాపింగ్, కాలేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణాల అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త ఆరోపించారు.
దిశ, నిజామాబాద్ సిటీ : ఫోన్ టాపింగ్, కాలేశ్వరం ప్రాజెక్ట్ కుంభకోణాల అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త ఆరోపించారు. గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్ బుద్ది తెచ్చుకొని ప్రవర్తిస్తారు అనుకుంటే మళ్లీ అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇంకా బీజేపీ పైన ఏడ్వడం సరికాదన్నారు.
రేవంత్ 15 స్థానాలు గెలుస్తామని గొప్పలు పలికి సొంత జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోయాడని, ఇందుకు బాధ్యత వహించి తక్షణమే రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పలు చోట్ల రెండో స్థానంలో గట్టి పోటీ ఇచ్చిందన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోతే తెలంగాణ ప్రజలు నీ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమన్నారు. డిసెంబర్ 9న ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి ఉత్సవాలను ఖండిస్తున్నామని, రేవంత్ సోనియా మెప్పు కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆనాడు బలిదేవత సోనియమ్మ అన్న రేవంత్ ఈనాడు తెలంగాణ తల్లి అని ఆమె పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహించడంను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.