ఇంకెంత కాలమో.. ఈ ఎదురు చూపులు..
టీఎస్ పీఎస్సీ ద్వారా డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ (వర్క్స్) గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ అఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 పోస్టుల భర్తీ కోసం 2024 లో పరీక్షను నిర్వహించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : టీఎస్ పీఎస్సీ ద్వారా డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ (వర్క్స్) గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ అఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 53 పోస్టుల భర్తీ కోసం 2024 లో పరీక్షను నిర్వహించారు. ఆ పరీక్ష రాసిన వారిలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారిలో వడబోత ద్వారా 51 మందిని ఎంపిక చేశారు. డీఏఓ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటి వరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సరం చేస్తోంది. కొద్ది నెలలుగా ఉద్యోగ నియామక పత్రాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ (డీఏఓ) గ్రేడ్ - 2 పోస్టుల భర్తీ కోసం టీజీ పీఎస్సీ ద్వారా మల్టీ జోన్ - 1 లో 28 పోస్టులకు, మల్టీ జోన్ - 2 లో 25 పోస్టులు కలిపి మొత్తం 53 పోస్టుల భర్తీ కోసం 2022 ఆగస్టు నెలలో ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది నిరుద్యోగులు ప్రభుత్వం నిర్దేశించిన పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్ పీఎస్సీ ద్వారా 2023 ఫిబ్రవరి నెలలో పరీక్షను కూడా నిర్వహించింది. కానీ, అప్పట్లో పరీక్ష పేపర్ లీకేజీ ఇష్యూ కారణంగా ఆ పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. తిరిగి అవే పోస్టుల భర్తీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు పరీక్ష నిర్వహించలేదు. ఈ లోపు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 జూన్ నెలలో టీజీ పీఎస్సీ ద్వారా డివిజనల్ అకౌంటింగ్ ఆఫీసర్ (డీఏఓ) గ్రేడ్ 2 పరీక్షను ప్రభుత్వం మళ్లీ నిర్వహించింది.
గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని 5 రోజుల పాటు ఆన్ లైన్ మోడ్ లో పకడ్బందీగా ఈ పరీక్షను నిర్వహించింది. దాదాపు లక్ష మంది పరీక్ష రాశారు. ఎలాంటి వివాదం తలెత్తకుండా పరీక్షను విజయవంతంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన రిజల్ట్స్ నవంబర్ నెలాఖరులో రిలీజ్ చేశారు. 53 పోస్టుల్లో రెండు పోస్టులకు సంబంధించిన ఫలితాలు విత్ హెల్డ్ లో ఉంచారు. మిగిలిన 51 పోస్టులకు 1 : 2 నిష్పత్తి ప్రకారం 112 మందిని ఇంటర్వూకు పిలిచారు. వీరిలో వడబోత అనంతరం 51 మందిని సెలెక్ట్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ల వివరాలు కూడా టీజీ పీఎస్సీ రిలీజ్ చేసింది. సెలెక్టెడ్ క్యాండిడేట్లకు 2024 నవంబర్ 11, 12 తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ నిర్వహించారు. జనవరి 6 నుంచి 9 వరకు డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం ఇక్కడ వరకు అంతా సక్రమంగానే జరిగాయి. టీజీపీఎస్సీ ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించి సెలెక్టెడ్ క్యాండిడేట్ల లిస్టును కూడా రిలీజ్ చేసింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడంలో తాత్సరం..
రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ ద్వారా చేపట్టిన డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్స్ (వర్క్స్) గ్రేడ్ 2 ఇన్ డైరెక్టర్ అఫ్ వర్క్స్ అకౌంట్స్ రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా సవ్యంగానే జరిగింది. మొదట్లో పేపర్ లీకేజీ ఇష్యూ, ఆపై పరీక్ష రద్దు మినహా తర్వాత దీనిపై ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఇప్పటి వరకు సెలెక్టెడ్ క్యాండిడేట్లకు పోస్టింగులు ఇవ్వడం లేదు. పోస్టింగులు ఖరారు చేసి అపాయిట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో డీఏఓ గ్రేడ్ - 2 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆందోళనకు గురవుతున్నారు. అసలే ఓసారి పరీక్ష రాసాక లీకేజీ ఇష్యూతో రద్దు చేయబడి తరువాత రెండో సారి పరీక్షను ఎదుర్కొన్న అనుభవంతో ఉన్న అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అసలే వివాదంతో మొదలైన ఈ నియామక ప్రక్రియ చివరి దశకు వచ్చి ఆలస్యమవుతుండటంతో మళ్లీ ఏ అవాంతరం వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో త్వరగా ఓ నిర్ణయం తీసుకుని తమకు పోస్టింగులు కేటాయించి అపాయిట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని సెలెక్టెడ్ క్యాండిడేట్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆలస్యమవుతున్న కొద్దీ పెరుగుతున్న ఆందోళన..
అపాయిట్మెంట్ ఆర్డర్లు అందుకోవడం ఆలస్యమవుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళనకు పెరిపోతోంది. సెలెక్టెడ్ లిస్టులో వచ్చి నెలలు గడుస్తున్నా అపాయిట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోవడం అభ్యర్థులను టెన్షన్ కు గురి చేస్తోంది. రోజు రోజుకూ ఆందోళన విపరీతంగా పెరుగుతోందని కరీంనగర్, ఖమ్మం, నిజామామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పలువురు సెలెక్టెడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కన్నా వెనక నోటిఫికేషన్ లు వెలువడిన వివిధ ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులకు భర్తీ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయని, వారు ఎంచక్కా జాబ్ లో కూడా జాయిన్ అయ్యారని వారంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మా ఆవేదనను పట్టించుకుని త్వరగా ఓ ప్రకటన చేయడంతో పాటు నియామక పత్రాలు కూడా ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.