తెగిపడిన 11 కేవీ విద్యుత్ వైర్ : తృటిలో తప్పిన పెను ప్రమాదం

నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి పెను ప్రమాదం తప్పింది.

Update: 2023-03-10 16:20 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు 11 కె.వి విద్యుత్ వైరు తెగిపడి పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలోని సూఫీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పాలిమర్ డిస్క్ ఫెయిల్ అయ్యి, ట్రాన్స్ ఫార్మర్ పైన భారీ శబ్దంతో మంటలు మండి హెచ్టీ - ఎల్టీ 11 కేవీ విద్యుత్ వైరు కింద పడిపోయింది. ఈ సమయంలో విద్యుత్ సరఫరా జరుగుతుంది. బోధన్ - హైదరాబాద్ ప్రధాన రహదారి పక్కనే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు, స్థానిక ప్రజలు ట్రాన్స్ ఫార్మర్ పైన ఏర్పడిన మంటలు, బారీ ద్వనితో తీవ్ర భయాందోళన కు గురయ్యారు.

స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేశారు. విద్యుత్ వైర్ కు మరమ్మతులు చేసి సాయంత్రం వేళలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ ప్రమాదం కారణంగా మండల కేంద్రంలోని పలుకాలనీలలో ఇళ్లల్లోని సుమారు 50 నుండి 60 వరకు విద్యుత్ మీటరు కాలిపోయినట్లు, అలాగే ఇళ్లల్లోని టీవీలు, ఫ్రీజ్ లు, ఇతర విద్యుత్ పరికరాలు, దుకాణాలలోని మోటార్లు, కాలిపోయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జరిగిన ప్రమాదం కారణంగా లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లినట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుండి అయినా ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News