కొత్త జోష్‌లో బీజేపీ.. రైతు దీక్షతో ఫుల్ స్వింగ్‌లోకి.. కానీ అదొక్కటే ప్రాబ్లమ్

Update: 2024-10-02 02:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్తబ్దంగా ఉన్న బీజేపీ శ్రేణుల్లో రైతు హామీల సాధన దీక్ష కొత్త జోష్ తీసుకువచ్చింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇదే దూకుడును కొనసాగించాలని కోరుతున్నారు. అయితే దీనికి కొందరు నేతలు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కమలంలో కొత్త నేతల హవా మొదలైందనే చర్చ సైతం జరుగుతున్నది. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి జమ్మూ కశ్మీర్ ఎన్నికల బిజీలో ఉండటంతో దీక్షకు హాజరు కాలేదు. దుర్గామాత దీక్ష తీసుకున్న నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాలేకపోయారు. ఇతర రాష్ట్రాల పర్యటనలో ఉండడంతో ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్ దీక్షలో పాల్గొనలేదని తెలిసింది. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గైర్హాజరైనట్లు సమాచారం.

యాక్టివ్ మోడ్ లోకి శ్రేణులు

రైతు హామీల సాధన దీక్షతో బీజేపీ శ్రేణులు యాక్టివ్ మోడ్ లోకి వచ్చినట్లయింది. దీక్ష పార్టీకి ప్లస్ అయిందనే చర్చ జరుగుతున్నది. సభ్యత్వ నమోదు టార్గెట్ రాష్ట్ర నాయకత్వం చేరుకోకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇన్ని రోజులు పార్టీ స్తబ్దుగా ఉండటంతో సభ్యత్వం తీసుకునేందుకు కూడా ఎవరూ ఆసక్తి కనబరచలేదు. అయితే ఈ దీక్షతో స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదుకు వచ్చే అవకాశముందని నాయకులు చర్చించుకుంటున్నారు. నాయకులకు కూడా ఏం చెప్పి కొత్తవారితో సభ్యత్వాలను చేయించాలనే ప్రశ్నలకు ఈ దీక్ష జవాబుగా మారిందని నాయకులు చెప్పుకుంటున్నారు.


Similar News