ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి వార్త
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. సోమవారం సైతం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.