ఎన్నికల వేళ మూడు పార్టీల్లో కొత్త టెన్షన్.. ఇలా అయితే గెలిచేదెలా..?
గ్రూపుల గోల పార్టీలకు గుదిబండగా మారుతోంది.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : గ్రూపుల గోల పార్టీలకు గుదిబండగా మారుతోంది. జోరుగా ప్రచారం చేయాల్సిన సమయంలో నేతల మధ్య ఆధిపత్య పోరు అగ్గి రాజేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాల్లోని మూడు ప్రధాన పార్టీల్లోని అభ్యర్ధుల మధ్య ఈగోలు, మనస్థర్థలు ఆయా పార్టీల్లో ఇంటిపోరుకు దారి తీస్తున్నాయి. ప్రచారం దాదాపు చివరకు చేరుకుంటున్న నేపథ్యంలో గ్రూపుల వల్ల తమ గెలుపునకు ఎక్కడ గండి పడుతుందోనని అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కమలం, హస్తం, కారు పార్టీల్లో తలనొప్పిగా మారిన కోల్డ్‌వార్‌పై దిశ కథనం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి వెళ్తుండగా, మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలు ఆదిలాబాద్ పరిధిలోకి వస్తాయి.
ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చేరికలతో జోరు మీద కనిపిస్తుంటే అదే చేరికలు ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఇన్‌చార్జీ మంత్రి సీతక్క ఎంత ప్రయత్నించినా.. పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారు పలువురు అధికారంలో పోగానే కాంగ్రెస్ పార్టీ బాట పట్టారు. అందులో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, కోనప్ప, రాథోడ్ బాపూరావుతో సహా ఆ పార్టీలో చేరారు. అంతకు ముందే రేఖానాయక్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ నియోజకవర్గాల్లో ఉన్న పాత నేతలకు, కొత్తగా చేరిన నేతలకు మధ్య పొసగడం లేదు. ఈ వర్గపోరుకు చెక్ పెట్టేందుకు స్వయంగా సీతక్క రంగంలోకి దిగారు. అయినా ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదు.
కమలంలో ఆయనదే పెత్తనం..
ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి అత్యంత దగ్గరగా ఉంటూ అన్నీ తానై నడిపిస్తున్నారు. అది మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు గిట్టడం లేదు. రెండు రోజుల కిందట జరిగిన సభలో సైతం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎడమోహం, పెడమోహంగానే ఉన్నారు. సభలో సమన్వయం లోపించింది. అభ్యర్థి మాట్లాడకుండానే అమిత్‌షా ప్రసంగం ముగించడం సభా నిర్వహణాలోపం కనిపించింది. ఈ వ్యవహారం అంతటిని, ఆ ఎమ్మెల్యే తీరును సైతం మిగతా ఎమ్మెల్యేలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే కాదు గతంలో ఆ ఎమ్మెల్యే తీరుపై బాహాటంగానే బీజేఎల్‌పీ నేత అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యేను పార్లమెంట్ ఇన్చార్జీగా తొలగించినా, ఆయన ఆ పదవిలోనే ఉన్నట్లు, ఆ ఎమ్మెల్యే పెత్తనం కొనసాగడం మిగతా వారికి గిట్టడం లేదు. ఇలా నలుగురు ఎమ్మెల్యేల మధ్య సమన్వయలోపం అభ్యర్థి ప్రచారంపై ప్రభావం చూపుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఒక మాజీ ఎమ్మెల్యేనే ఆర్థిక లావాదేవీలు, ప్రచార బాధ్యతలు అప్పగించడం మిగతా వారికి గిట్టడం లేదు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి బాధ్యతలు తక్కువగా అప్పగించి పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీనే నమ్మడం పట్ల మిగతా నేతలు నారాజ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.