బల్దియాకి ట్యాక్స్ టెన్షన్.. వారికి కోత ఎక్కువే

దిశ, సిటీ బ్యూరో: మహానగరవాసులకు అవసరమైన, అత్యవసరమైన సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో

Update: 2022-03-15 02:36 GMT

దిశ, సిటీ బ్యూరో: మహానగరవాసులకు అవసరమైన, అత్యవసరమైన సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో ప్రస్తుతం రెండు రకాల ట్యాక్స్ టెన్షన్ కొనసాగుతుంది. మొదటికి జీహెచ్ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ ను టార్గెట్ కు తగిన విధంగా వసూలు చేసుకునేందుకు ఇదే చివరి మాసం కాగా, కార్పొరేషన్ ఉద్యోగులు సైతం తమ ఆదాయపన్నును చెల్లించేందుకు ఇదే చివరి మాసం కావటంతో రెండు రకాల పద్దులను చూడటంలో అధికారులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులే గాక, ప్రతి ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించాలన్నది వారి విధి, బాధ్యత సైతం. ఇలాగనీ ఓ సరైన పద్దతి గానీ, విధానం గానీ లేకుండా ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న బల్దియా ఉద్యోగులు సంవత్సరం మొత్తం బాగానే జీతభత్యాలు పుచ్చుకుని ఆర్థిక మాసంలో చివరి నెల అయిన మార్చిలో అసలు ఇంటికి తీసుకెళ్లరు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో దాదాపు నాలుగున్నర వేల నుంచి ఐదు వేల మంది వరకు పర్మినెంట్ ఉద్యోగులుండగా, మరో 22 వేల నుంచి 23 వేల వరకు ఔట్ సోర్స్, కాంట్రాక్టు ఉద్యోగులంటున్నారు. వీరిలో కాంట్రాక్టు ఔట్ సోర్స్ ఉద్యోగులకు ప్రతి నెల ఆదాయ పన్ను కట్ చేసుకుని, మిగిలిన జీతాన్ని చెల్లిస్తున్నప్పటికీ, వారి తరపున థర్డ్ పార్టీగా నియమితులైన సంస్థ ప్రభుత్వానికి చెల్లిస్తుందా? అన్న విషయంపై అధికారుల వద్ద కూడా స్పష్టమైన సమాధానమే లేదు. చాలా మంది గ్రూప్ 3, 4 తరగతులకు చెందిన ఉద్యోగులు తమ నెలసరి నికర ఆదాయాన్ని సంవత్సరానికి లెక్క వేసి, నెలకు కొత్త ఆదాయ పన్నును చెల్లిస్తూ వస్తుంటారు. ఇలాంటి వారందరికీ వారికి జీతంపై బకాయి ఉన్న ఆదాయపన్నును వర్తమాన ఆర్ధిక సంవత్సరం చివరి మాసం అయిన మార్చి, అవసరమనుకుంటే ఏప్రిల్ మాసాల జీతలను కలిపి మొత్తం కట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించిన ఎప్పటిలాగే వారు విధులు నిర్వర్తించినా, వారికి జీతం చేతికిరాదు. ఆ నెల జీతం మొత్తం బకాయి ఉన్న ఆదాయ పన్ను కింద కట్ అవుతున్నందున ఏప్రిల్ మాసం ఎలా గడపాలన్న విషయంపై తర్జనభర్జన పడుతున్న పర్మినెంట్ ఉద్యోగులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ వారికి నుంచి నూటికి రూ. 5 వడ్డీ చొప్పున వేలాది రూపాయలను అప్పుగా తీసుకుంటూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.

డిప్యూటేషన్ ఉద్యోగులకు కోత ఎక్కువే

జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే మహానగరవాసులకు అవసరమైన సేవలంధించేందుకు అన్ని విభాగాలకు చెందిన అధికారులు సేవలు అవసరమవుతుండటంతో వివిధ విభాగాల నుంచి ఎక్కువ మంది డిప్యూటేషన్లపై వచ్చి ఇక్కడ విధులు నిర్వర్తింటారు. ఇక్కడే జీతాలను డ్రా చేసుకుంటారు. వీరిలో చాలా మంది డిప్యూటేషన్ గడువు కనీసం మూడేళ్లు, గరిష్టంగా ఐదేళ్లు ముగిసిన తర్వాత ఎలాగో మాతృ శాఖకు వెళ్లిపోతామనుకుని, జీతంలో నెలసరి ఆదాయ పన్ను కోతకు అనుమతించకుండా మొత్తం వార్షికంగా చెల్లించాలని భావిస్తుంటారు. ఇలాంటి అధికారుల జీతాలను ఆర్థిక సంవత్సరం చివరి నెల, రెండు నెలలు గానీ ఇన్ కమ్ ట్యాక్స్ కింద కట్ అవుతుండటంతో వారికి జీతంలో ఏమీ మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా కాకుండా ప్రతి ఉద్యోగికి అతని జీతాన్ని బట్టి ఏటా చెల్లించాల్సిన ఆదాయ పన్నును మొత్తం లెక్క కట్టి, 12 వాయిదాలుగా చెల్లించే వెసులుబాటు కల్పిస్తే, వారికి పన్ను చెల్లించిన భారం తెలియదు, ఆదాయ శాఖకు సక్రమంగా పన్ను చెల్లింపు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను కోత విషయంలో ఉద్యోగి అభిప్రాయం కాకుండా, ఉద్యోగి, ఆయనపై ఆధారపడిన వారి జీవనోపాధి వంటి కారణాలను పరిగణలోకి తీసుకుని సర్కారే ఓ నిర్ణయాన్ని తీసుకోవాలని కొందరు ఉద్యోగులంటున్నారు.

Tags:    

Similar News