హైదరాబాద్‌లో కొత్త వేరియంట్.. దేశంలోనే తొలి కేసు నమోదు

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​సిటీలో నివసించే ఓ వృద్ధుడు(80) కి కరోనా బీఏ 5 కొత్త వేరియంట్ సోకింది. దేశంలోనే తొలి కేసు ఇక్కడ నమోదైనట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

Update: 2022-05-23 15:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్​సిటీలో నివసించే ఓ వృద్ధుడు(80) కి కరోనా బీఏ 5 కొత్త వేరియంట్ సోకింది. దేశంలోనే తొలి కేసు ఇక్కడ నమోదైనట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు హెల్త్​ డైరెక్టర్​డాక్టర్ జీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. న్యాయ సలహాదారుడిగా పనిచేస్తున్న అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదన్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో ఈ నెల 12న అతను టెస్ట్ చేయించుకున్నాడని, ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ వచ్చిందన్నారు. అతని ప్రైమరీ కాంటాక్టులను ఇద్దరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామన్నారు. రిపోర్టులు రావాల్సి ఉన్నదన్నారు. బీఏ4, బీఏ 5 వేరియంట్లు ఒమిక్రాన్‌కు సబ్‌ వేరియంట్లు అని, ఇవి ఒమిక్రాన్ కంటే ప్రమాదకరం కాదని తేల్చేశారు. కానీ మిగతా వాటితో పోల్చితే వీటికి వ్యాపించే గుణం ఎక్కువగా ఉండటం వలన కాస్త గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీంతో ఫోర్ట్​ వేవ్​ వస్తుందనుకోవడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పది రోజుల నుంచి ప్రతీ శాంపిల్‌ను..

గడిచిన పది రోజుల నుంచి ఆర్టీపీసీఆర్ విధానంలో సేకరించిన ప్రతీ శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నామని డీహెచ్ తెలిపారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లోని వృద్ధుడికి బీఏ 5 తేలినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితి పూర్తి అదుపులోనే ఉన్నదని, ప్రజలెవ్వరూ టెన్షన్​పడాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు.


Similar News