నీరా టేస్ట్ అదుర్స్.. ఔషధ గుణాలు ఉండటంతో జనంలో క్రేజ్​

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ పట్నంవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నది.

Update: 2023-05-08 05:05 GMT

ఆహా ఏమి రుచి.. తాగరా మైమరిచి.. అంటూ నగరవాసులు నీరా కేఫ్​ వద్ద క్యూ కడుతున్నారు. పల్లెరుచులు అంటే చెవి కోసుకునే సిటీప్రజలు సహజంగానే నీరాకు వీరాభిమానులు అవుతున్నారు. పోషక విలువలతోపాటు ఔషధ గుణాలు కూడా ఉండటంతో కాస్తంత ధర ఎక్కువే అయినా, డోంట్​ కేర్​ అంటున్నారు. ఏదేమైనా పట్నంలో కల్లు రుచి చూస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ చిన్నా, పెద్దా అందరూ ఎంజాయ్​ చేస్తున్నారు.

దిశ ప్రతినిధి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ పట్నంవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. తెలంగాణ పల్లెల్లో అందుబాటులో ఉండే ఈత, తాటి నీరా, కల్లును పల్లె.. పట్నం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలు నీరా తాగడానికి ఆసక్తి చూపుతారు. అటువంటి నీరాను నగర ప్రజలకు కూడా అందుబాటులో తెచ్చేందుకు సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 3వ తేదీన అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర పర్యాటక శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నీరా కేఫ్ లో నోరూరించే తీయటి, చల్లని నీరాతో పాటు దాని అనుబంధ ఉత్పత్తులైన తేనె, బూస్ట్, షుగర్, బెల్లం కూడా విక్రయిస్తున్నారు. మార్కెట్లో దొరికే తేనే, బెల్లం, బూస్టు, చక్కర తో పోలిస్తే ధర అధికమైనప్పటికీ నాణ్యమైనది కావడం, ఆరోగ్యానికి మేలు చేస్తుండడంతో కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు.


పల్లెను తలపించేలా...

హుస్సేన్ సాగర్ తీరాన పల్లె అందాలను తలపించేలా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. జీ ప్లస్ వన్ అంతస్తుల్లో రెస్టారెంట్ తరహాలో భారీ ఏర్పాట్లు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో నీరా తో పాటు అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలు, మొదటి అంతస్తులో కూర్చుని సుమారు 300 మంది వరకు సేవించవచ్చు. నీరా కేఫ్ చుట్టూ ఎద్దుల బండి, తాటి, ఈత చెట్లు వాటిని ఎక్కుతున్న గీత కార్మికుల వంటి చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.


100% ప్యూర్​

నీరా శుద్ధమైనదేనా? నిల్వ చేసేందుకు ఏమైనా రసాయనాలు కలుపుతారా? అనేది నగర ప్రజల మెదళ్లను తొలుస్తున్నది. అయితే ఇందులో ఎలాంటి రసాయనాలు కలుపకుండానే ప్రకృతి సిద్ధంగా నీరాను ప్రజలకు అందిస్తున్నారు. దీనిని ప్రస్తుతం ముద్విన్ గ్రామం నుంచి ఎక్సైజ్ శాఖ నుండి అనుమతులు పొందిన ’ తన్నీరు ఫామ్ ప్రొడక్ట్స్‘ సంస్థ ప్రత్యేక సదుపాయాలు ఉన్న వాహనాల ద్వారా రవాణా చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పడు ఒకే కేఫ్ ఉండగా త్వరలో మరిన్ని అందుబాటులోకి తెచ్చి జహీరాబాద్ మునిపల్లి, నందనం గ్రామాల నుంచి కూడా నీరాను తెప్పించనున్నారు. ఇదిలా ఉండగా ప్రకృతి సిద్ధమైన నీరా నగరంలో అందుబాటులో ఉండడంతో ప్రజలు తెల్లవారగానే నీరా కేఫ్ కు పరుగులు పెడుతున్నారు.


కుండకు బదులుగా...

సాధారణంగా తాటి, ఈత చెట్లనుండి వచ్చే నీరాను సూర్యోదయం కంటే ముందే తాగాల్సి ఉంటుంది. ఎండ పడితే పుల్లగా మారి.. కల్లు అవుతుంది. అయితే కొన్నిప్రత్యేక పద్ధతుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెట్టు మీద నుండే రుచి మారకుండా నగర ప్రజలకు సరఫరా చేస్తున్నది. గ్రామాల్లోని తాటి, ఈత చెట్లకు మట్టితో చేసిన కుండలు కట్టడం చూస్తుంటాం. కానీ నీరా కోసం కేరళ కాసర్‌గాడ్‌లోని ఫామ్ జాతి చెట్లకు వినియోగించే ‘సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్​ ’ (సీపీసీఆర్)విధానాన్ని ఎంచుకున్నారు . దీని ప్రకారం తాటి, ఈత చెట్లకు కల్లు కోసం మట్టి కుండల స్థానంలో ‘చిల్లర్ బాక్స్’ను కడతారు. వీటిల్లో ఐస్ తో పాటు ఫుడ్ గ్రేడెన్ కవర్ ఉంచి అందులో ఈగలు, ఇతర క్రిమి కీటకాలు పడకుండా చేస్తారు. ఫలితంగా కల్లు ఉష్ణోగ్రతను 0 నుండి 4 డిగ్రీలు దాటకుండా ఉంటుంది. దీంతో నీరా రుచి మారకుండా మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా చెట్ల నుండి సేకరించి నగరానికి తీసుకువచ్చిన నీరాను కేఫ్ లో ఫిల్టర్ చేసి విక్రయిస్తున్నారు.


నాన్ ఆల్కాహాలిక్

సాధారణంగా మద్యం, కల్లు తాగి వాహనాలు నడిపితే బ్రీత్​ అనలైజర్​ టెస్ట్​లో దొరికిపోతారు. అయితే నీరా తాగడం వల్ల డ్రంక్ డ్రైవ్ ఇబ్బందులు ఉండవని అధికారులు చెప్తున్నారు. 0 నుండి 4 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేస్తే నీరా రుచి మారదు. చల్లగా కూల్ డ్రింక్ తాగినట్లుగా ఉంటుంది. నీరా పులిసిపోకపోవడంతో అందులో ఆల్కహాల్ ఉత్పత్తి జరుగదని స్పష్టం చేస్తున్నారు.


బీ అలర్ట్​.. ఆల్కహాల్‌గా మారే ప్రమాదం

నగర ప్రజలకు నీరా అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన నీరా నాలుగు గంటలలోపు తాగితే ఎలాంటి సమస్య లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే నిర్ణీత సమయం తర్వాత తాగితే అది పులిసిపోయి ఆల్కాహాల్​గా మారే ప్రమాదం ఉందని కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తాగితే బ్రీత్​ అనలైజర్​లో మోతాదుకు మించి ఆల్కాహాల్ పర్సెంట్​ నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో అధికారులు స్పష్టతనివ్వాలని నీరా అభిమానులు కోరుతున్నారు.









 


 


 


 


Tags:    

Similar News