బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో కీలక నేతల పేర్లు మిస్.. ఆ లీడర్లకు టికెట్ దక్కకపోవడానికి కారణం అదేనా..?

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాని పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. అధికార బీఆర్ఎస్ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. అన్ని పార్టీల కంటే

Update: 2023-10-22 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. అన్ని పార్టీల కంటే ముందుగానే కదనరంగంలోకి దిగింది. ఈ సారి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కాంగ్రెస్ పార్టీ.. సుదీర్ఘ కసరత్తు అనంతరం 55 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే వరకు వెయిట్ చేసిన బీజేపీ.. ఎట్టకేలకు ఆదివారం ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ప్రకటించింది.

ఈ జాబితాలో ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్, సోయం బాపురావు పేర్లను ప్రకటించింది. అర్వింద్ కోరుట్ల, బండి సంజయ్ కరీంనగర్, బాపురావు బోథ్ అసెంబ్లీ స్థానాల నుండి బరిలోకి దిగనున్నారు. అయితే, బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో రాష్ట్ర అగ్రనేతలు పేర్లు మాత్రం కనిపించలేదు. కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఈ సారి ఎన్నికల బరిలోకి దిగడం లేదని సమాచారం. ప్రచారం, నేతల మధ్య సమన్వయం ఇతర బాధ్యతల దృష్టా హై కమాండ్ వీరికి మినహాయింపు ఇచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌‌లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. స్టేట్ బీజేపీ టాప్ లీడర్స్ పేర్లు మాత్రం ఫస్ట్ లిస్ట్‌లో కనిపించకపోవడం కమలం పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కనిపించని కీలక నేతల పేర్లు..!

ఎలాంటి వివాదం, నేతల మధ్య పోటీ లేని 52 స్థానాలకు బీజేపీ ఇవాళ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఈ జాబితాలో రాష్ట్ర అగ్రనేతలకు మాత్రం చోటు దక్కలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి పేర్లు ఫస్ట్ లిస్ట్‌లో లేవు. అంతేకాకుండా మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్యలకు సైతం బీజేపీ తొలి జాబితాలో స్థానం దక్కలేదు. రాష్ట్ర కీలక నేతలకు ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కపోవడంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేతల పేర్లను హై కమాండ్ హోల్డ్‌లో పెట్టడానికి గల కారణం ఏంటన్న దానిపై కొత్త చర్చ మొదలైంది. తొలి జాబితాలో చోటు దక్కని కీలక నేతలు కొందరు.. గత కొంత కాలంగా రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇటీవల ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలోనూ ఈ నేతలు అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. రాష్ట్ర బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వీరంతా రహస్యంగా భేటీ అయ్యి చర్చలు సైతం జరిపారు. నేరుగా హై కమాండ్ వద్దే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకానొక సమయంలో వీరు పార్టీ మారుతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ తిరుగుబాటు అంశాలను పరిగణలోకి తీసుకునే బీజేపీ హై కమాండ్ వీరికి ఫస్ట్ లిస్ట్‌లో టికెట్ ఇవ్వలేదని పొలిటికల్ కారిడార్‌లో ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ లిస్ట్‌లో తమ పేరు లేకపోవడంతో ఆ నేతలు సైతం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. బీజేపీ సెకండ్ లిస్ట్ లోనైనా వీరి పేరు ఉంటుందో చూడాలి మరీ.

Tags:    

Similar News