ప్రజా పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు..
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
దిశ, నార్కట్ పల్లి : సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని జీర్ణించుకోలేక రాద్ధాంతాలు చేస్తున్నారని మండిపడ్డారు. నార్కట్ పల్లి పట్టణంలోని పలు కాలనీలలో చేపట్టిన అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రస్తుతం ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని,ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రస్తుతం వారే ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా మారుస్తానని హామీ ఇచ్చారు. ఏవో కల్లబొల్లి మాటలు చెప్తే ఇక్కడ ప్రజలు పట్టించుకోరని ప్రతిపక్ష నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. వారికి ఈ ప్రాంతంలో స్థానం లేదనే విషయాన్ని తెలిపారని పునరుద్గాటించారు. ఇప్పటికే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును నీటితో నింపి..రాబోయే రోజుల్లో ఈ ప్రాంత రైతాంగానికి నీటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. తొమ్మిదేళ్లుగా ప్రాజెక్టును పట్టించుకోకుండా వదిలేసిన ఘనత బీఆర్ ఎస్ నాయకులదేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య గౌడ్, నాయకులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్, పాశం శ్రీనివాస్ రెడ్డి, వడ్డే భూపాల్ రెడ్డి, స ట్టు సత్తయ్య, జేరిపోతుల భరత్, దూదిమెట్ల స్రవంతి, రాదారపు బిక్షపతి, ఐతరాజు యాదయ్య, గాయం శ్యాంసుందర్ రెడ్డి, ఇడుకుల్ల సంపత్, తదితర నాయకులు పాల్గొన్నారు.