దిశ, డిండిః తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో నుంచి వరద నీటితో డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తోంది. ఈ దృశ్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో డిండి డ్యాం పైనుంచి కిందికి జారుతున్న జలాలను చూసి పర్యాటకులు పరవశించి పోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సుందరమైన దృశ్యాలను తమ ఫోన్లలో క్లిక్ అనిపిస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ సంబరపడుతున్నారు. ఆయకట్టు రైతులకు పంటల సాగు కోసం ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడంతో పంటలు ఎండిపోతాయేమోనని రైతులు ఆందోళనలో ప్రాజెక్టు నిండి అలుగు పోయడంతో రైతులు సంతోష పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద మత్స్యకారులు చేప ఫ్రై, చేప పులుసు వంటకాలను సందర్శకులకు అమ్ముతూ జీవనోపాధి పొందుతున్నారు. పోలీస్ శాఖ మరియు నీటిపారుదారుల శాఖ అధికారులు వచ్చిపోయే సందర్శకులకు నీటి వద్దకు వెళ్ళవద్దని దూరం నుంచే సెల్ఫీలు దిగాలని హెచ్చరిస్తున్నారు. ఆనకట్ట పైనుంచి కిందికి జారుతున్న నీటి వేగానికి నీటి తుంపర్లు మీద పడటంతో పర్యాటకులు తన్మయం చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించడంతో సుదూర ప్రాంతాల పర్యాటకులు, డిండి పరిసర ప్రాంతాల ప్రజలతో రద్దీగా మారింది.