అత్తారింట్లో విషాదం…అల్లుడు ఇంట్లో దొంగతనం

గుర్తుతెలియని ముసుకు దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తున్న వారి మెడపై కత్తి పెట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని వెల్లటూరు కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Update: 2024-09-19 13:33 GMT

దిశ, మేళ్లచెరువు : గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తున్న వారి మెడపై కత్తి పెట్టి బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలోని వెల్లటూరు కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వెల్లటూరు కాలనీలో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి వెంకయ్య ఇటుకల బట్టి వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. బుధవారం తన భార్య తండ్రి అయిన మామ చనిపోవడంతో కోదాడ వెళ్ళాడు. అలాగే తాత చనిపోయాడు అని విషయం తెలుసుకున్న హైదరాబాద్ లో ఉంటున్న తన ఇద్దరు అమ్మాయిలు కూడా కోదాడ వచ్చారు. అక్కడ అంత్యక్రియలు కాకపోవడం ఆ రాత్రి అక్కడ ఉండేందుకు సరైన వసతులు లేకపోవడంతో రాత్రి ఇంటికి వెళ్లి గురువారం ఉదయం కోదాడ వద్దామని మేళ్లచెరువులోని వెల్లటూరు కాలనీలోని తన ఇంటికి రాత్రి ఒకటి గంటలకు వెళ్లాడు.

గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తలుపులు కొట్టడంతో తలుపులు తీయగా 5గురు దొంగలు కత్తులతో మాస్కులు ధరించి తమ పీకలపై కత్తులు పెట్టి ఇంట్లో క్యాష్ ఉందని దానిని ఇస్తే వదిలేస్తామని లేకపోతే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. తాను పేదవాడినని తన వద్ద డబ్బు లేదని ఎంత బతిమిలాడినా వినలేదని ఇంట్లోని బట్టలు, ఫ్రిజ్ ఇంటిని మొత్తం సోదా చేసి బీరువా తాళాలు తీసుకొని బీరువాలోని బంగారం, సుమారు 50 వేలు నగదు, తమ మెడలోని గొలుసులు, దిద్దులు ఇతరత్రా సుమారు 5.1/2 తులాలు వెండి దోచుకుని తెల్లవారు 4 గంటల సమయంలో వెళ్లిపోయారని చెప్పారు. వెళ్లే సమయంలో తమ సెల్ ఫోన్లు తీసుకుని దూరంగా పారవేసారని ఈ విషయాన్ని మేళ్లచెరువు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. అత్తారింట్లో విషాదం అల్లుడు ఇంట్లో దొంగలు బీభత్సం చేయడంతో గ్రామంలో ఈ విషయంపై చర్చించుకుంటున్నారు.

దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

ఈ దొంగతనం జరిగిన ఇంటిని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ పరిశీలించారు. బాధితుల నుంచి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్, డాగ్ స్క్వాడ్ తో 7 బృందాలను ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేపట్టామని తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని అన్నారు. వీరి వెంట ఏ ఎస్పి నాగేశ్వరరావు ,డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ,సీఐ రజిత రెడ్డి మేళ్లచెరువు ఎస్సై పరమేశ్ ఉన్నారు.


Similar News