పచ్చడి కాయకు భలే డిమాండ్..

వేసవికాలం ప్రారంభమైందంటే ప్రతి ఇంట్లో ప్రధానంగా గుర్తొచ్చేది పచ్చళ్ళు. ఇందులో ప్రధానమైంది మామిడి.

Update: 2023-04-29 14:45 GMT

దిశ, తుంగతుర్తి : వేసవికాలం ప్రారంభమైందంటే ప్రతి ఇంట్లో ప్రధానంగా గుర్తొచ్చేది పచ్చళ్ళు. ఇందులో ప్రధానమైంది మామిడి. మామిడి తోటలకు నెలవైన తుంగతుర్తి ప్రాంతంలో ప్రతి ఏటా ఎక్కడపడితే అక్కడే పచ్చడి కాయల అమ్మకాలు సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా చౌక ధరల్లో లభిస్తుండేవి. అయితే ఈసారి పరిస్థితులు మారాయి. మామిడి పచ్చడి పెట్టాలనుకునే వారికి ఆ కాయల కరువు ఏర్పడింది. పైగా మార్కెట్లో మామిడికాయకు పెరిగిన ధరను చూసి కళ్ళు తేలేసెంత పని ఏర్పడింది. అయినప్పటికీ దానిపై ఉన్న మమకారాన్ని చంపుకోలేక కొంతలో కొంతగా పచ్చడి పెడుతున్నారు. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షాల ప్రభావమే కాయల కొరతకు ప్రధాన కారణం. ప్రధానంగా ప్రతి ఇంట్లో మార్చి మాసం నుండే మామిడి పచ్చళ్ళ తయారీకి రూపకల్పన జరుగుతుంది.

అయితే ఈసారి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాయ సైజు పచ్చడికి అనుగుణంగా ఎదగలేదు. కొన్ని ప్రాంతాల చెట్లకు కాయ ఎదిగినప్పటికీ పచ్చళ్ళు పెట్టే తరుణంలోనే బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాల ప్రభావంతో చెట్ల మీద ఉన్న కాయ చాలావరకు రాలింది. అనంతరం ఏప్రిల్ మాసం ప్రారంభం నుండి చివరి వరకు నాలుగు, ఐదు మార్లు ఈదురు గాలులు, వర్షాలు రావడంతో చెట్లకు కొంతలో కొంత ఉన్న కాయ రాలిపోయింది. ఇలాంటి పరిస్థితులతో పచ్చడి కాయ కరువైంది. ప్రతి ఏట వారసంతలో అమ్మకానికి వచ్చే పచ్చడి మామిడికాయ ఈసారి రావడం లేదు. దీంతో వినియోగదారులు దూరభారాలతో సంబంధం లేకుండా పచ్చడి కాయ అమ్మకాలు జరిగే ప్రాంతానికి వెళ్లి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారు.

గత ఏడాది నాణ్యమైన కాయ ఒక్కంటికి రూ.10 ధర ఉండగా ఈసారి అదే సైజులో ఉన్న కాయ అవేమీ లేకుండానే ఒక్కంటికి రూ.25 పలుకుతోంది. అయినప్పటికీ వినియోగదారులు ఆలస్యం చేస్తే దొరకడం కష్టమని భావించి కాయలను కొనుగోలు చేస్తున్నారు. మొత్తానికి రాలిపోయిన కాయతో నష్టాల పాలైన రైతులు కొందరైతే...అధిక ధరలను పెంచి సొమ్ము చేసుకునే రైతులు మరి కొందరు. ముఖ్యంగా మామిడి తోటలను కలిగి ఉన్న రైతులు కూడా ఈసారి అధిక ధరతో కొనుగోలు చేయడం గమనార్హం.

Tags:    

Similar News