స్వామి వారిని దర్శించుకున్న కోటి 17 లక్షల మంది భక్తులు
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారిని 2024లో కోటి 17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారిని 2024లో కోటి 17 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలకు స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నట్లు చెప్పారు. గిరి ప్రదక్షిణ మార్గంలో యదారుషి,ప్రహ్లాదుడు మండపాలు ఏర్పాట్లు చేశామని, భక్తులు సేద తీరడం కోసం జర్మనీ షెడ్లు ఏర్పాట్లు చేశామన్నారు.ఎస్వీడీసీ స్క్రీన్,డోనర్ సెల్,అఖండ దీపం, కొబ్బరికాయ కొట్టే స్థలం,విష్ణు పుష్కరిణిని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. యాదగిరిగుట్ట పట్టణ ప్రజలకు శనివారం, మంగళవారం దర్శనం ఏర్పాట్లు చేశామని, ఆలయంలో 500 మంది నుంచి 1200మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని పెంచినట్లు వెల్లడించారు. అసంపూర్తిగా వున్న అన్న ప్రసాద భవనంను జనవరి 15న అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. స్వర్ణతాపడం కోసం రూ. 21 కోట్లు, రూ. 38 లక్షలు విరాళం ,10 కేజీల బంగారం వచ్చిందన్నారు. ద్వజస్థంభం, కళశాలు, మహా ద్వారం బంగారు తాపడం పనులు చేసిన వారికే ఆలయ గోపుర స్వర్ణ తాపడం పనులు అప్పగించామన్నారు. త్వరలో తిరుమల తరహాలో వీఐపీ, వీవీఐపీ టికెట్స్ తీసుకుని వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నమన్నారు. విమానం గోపురానికి జనవరి 20 వరకు విరాళాలు అందజేయవచ్చునని, ఫిబ్రవరిలో మహా సంప్రోక్షణా కార్యక్రమాలు చేపడతామన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారు ఉదయం 5 : 15 గంటలకు భక్తులకు ఉత్తర ద్వార రాజగోపురం ద్వారా దర్శనం ఇవ్వనున్నట్లు చెప్పారు.