కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలి
కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలని, అది దేశానికే రోల్ మోడల్ కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
దిశ, చౌటుప్పల్ టౌన్ : కులగణనపై బీజేపీ, బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలని, అది దేశానికే రోల్ మోడల్ కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రతిభ ఒకేషనల్ కళాశాలలో గురువారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను స్వాగతిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటి 17 లక్షల పైచిలుకు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. కులాల వారీగా డేటా లేకపోతే బీసీలకు కోటా దక్కదని అన్నారు.
బీసీ కులగణన జరగకుండా బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి కులగణనపై వారి వైఖరేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ, రాజాసింగ్, బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి వారు కులగణన దేనికోసమని అడుగుతున్నారని, వారికి కులగణన దేనికోసమో తెలియదా అని ప్రశ్నించారు. పూట పూటకు పార్టీ మార్చే మహేశ్వర్ రెడ్డి కులగణన గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు కులగణనపై వారి వైఖరిని తెలియజేయాలని కోరారు.
రాష్ట్రంలో కొన్ని శక్తులు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కులగణనకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల పైన ఒక నోడల్ ఆఫీసర్ ని నియమించాలని కోరారు. ముఖ్యమంత్రి, సీఎస్ లాంటి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మాజీ ఎంపీపీ బొంగు జంగయ్య గౌడ్, బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షుడు వీరమల్ల కార్తీక్ గౌడ్, బీసీ యువజన సంఘం జిల్లా కార్యదర్శి సిలివేరు శ్రీనివాస్, వెంకటేశం, సతీష్, నరేష్, భరత్, సాయి, నవీన్, పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.