గ్రంథాలయానికి స్వీపరే అధికారి.. అసలైన ఆఫీసర్ నిత్యం డుమ్మా

Update: 2024-08-24 13:33 GMT

దిశ, హాలియాః గ్రంధాలయాలు విజ్ఞాన గనులు అని మహానుభావులు చెప్పిన విషయం తెలిసిందే. గ్రంథాలయాల ద్వారా గ్రామీణ ప్రాంత యువత ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విషయం నిత్యం పత్రికల్లో చూస్తున్న వాస్తవాలు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకునే అవకాశం ఉందంటే అది ఒక గ్రంథాలయం మాత్రమే. అయితే హాలియా పట్టణంలో నెలకొల్పిన శాఖ గ్రంథాలయాన్ని నిర్లక్ష్యం అలుముకుంది. గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక్కడ పనిచేసే గ్రంథాలయాధికారి విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే సదరు అధికారి వారానికోసారి లేదంటే 15 రోజులకోసారి వస్తున్నారని స్థానికులు అంటున్నారు. కనీస విజ్ఞానం కోసం ఎటువంటి పుస్తకాలు లేకపోవడంతో యువత గ్రంథాలయానికి రావడం గణనీయంగా తగ్గిందంటున్నారు. గ్రంథాలయానికి రోజుకు ఎంతమంది వస్తున్నారనే విషయాన్ని తెలియపరిచే రిజిస్టర్ ఉండాల్సి ఉండగా సదరు అధికారి నిర్లక్ష్యం కారణంగా ఎటువంటి రిజిస్టర్లు మెయింటైన్ చేయడం లేదు.

దినపత్రికలకే పరిమితం..

హాలియా శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు నిరుద్యోగులకు విజ్ఞానం అందించే ఎటువంటి పుస్తకాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. గ్రంథాలయంలో కేవలం నిత్య దినపత్రికలు మినహా ఎటువంటి విజ్ఞాన పుస్తకాలు లేకపోవడంతో నిరుద్యోగ యువత విజ్ఞానం నేర్చుకునే పరిస్థితి కనపడడం లేదని వాపోతున్నారు. 20 ఏళ్లుగా ఎంతో మందికి విజ్ఞానం అందించిన శాఖ గ్రంథాలయంలో గతంలో పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్ లాంటి పుస్తకాలు అందుబాటులో ఉండగా ప్రస్తుతం ఎటువంటి పుస్తకాలు అందుబాటులో లేకపోవడం శాఖ పనితీరుకు అడ్డం పడుతుంది. అంతేకాకుండా దినపత్రికలను ఏరోజుకారోజుగా ఫైల్ ట్యాగ్ చేసి భద్రపరాధించాల్సి ఉండగా ఇక్కడ పనిచేసే అధికారి నిర్లక్ష్యం కారణంగా పత్రికలు చెత్తకుప్పకు చేరుకుంటున్నాయి.

స్వీపరే సర్వాధికారి..

హాలియా శాఖ గ్రంధాలయంలో స్వీపర్ గా పనిచేస్తున్న ఓ మహిళనే నిత్యం గ్రంథాలయ తాళాలు తీస్తున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు. ఇక్కడ పనిచేసే గ్రంథాలయాధికారి సరిగ్గా రాకపోవడంతో స్వీపరే అన్ని చూసుకుంటుందని చెబుతున్నారు. గ్రంథాలయ శాఖ ప్రత్యేక దృష్టి సారించి హాలియా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ పుస్తకాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని యువత పేర్కొంటున్నారు.


Similar News