Minister : గత పాలకుల నిర్లక్ష్యమే గండ్లకు కారణం

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సాగర్ కాలువ కట్ట గండ్ల కు కారణమని, లోపభూయిష్టమైన నిర్వహణ ఫలితమే ఇంతటి నష్టం సంభవించిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Update: 2024-09-24 12:24 GMT

దిశ, నడిగూడెం: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రస్తుత సాగర్ కాలువ కట్ట గండ్ల కు కారణమని, లోపభూయిష్టమైన నిర్వహణ ఫలితమే ఇంతటి నష్టం సంభవించిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల పరిధిలోని కాగిత రామచంద్రాపురం 132 కి మీ వద్ద సాగర్ ఎడమ కాలువ కట్ట కు పడిన గండి మరమ్మత్తు పనులను ఆయన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లష్కర్ లతో పాటు ఇంజనీర్లను, సిబ్బంది నియామకాలు చేపట్టకుండా నీటిపారుదల శాఖ ను నిర్వీర్యం చేసి నేడు వరదలపై బురద రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. తమ పదేళ్ల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విపక్షం విమర్శలు చేస్తుందని దుయ్యబట్టారు. గండి పడిన ప్రాంతం వరకు సాగునీరు అందించాలని, తుదిదశ పనులను పూర్తి చేయడంలో ఎందుకు ఆలస్యమవుతుందని అధికారులను ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కొందరు రైతులు నీటి సరఫరా లేక తమ పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చేపట్టారు. రైతులు అధైర్యపడవద్దని, పంటలకు నష్టం జరగకుండా ఖరీఫ్ పంటలను కాపాడుకునేందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నీటి విడుదలకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బుధవారం ఉదయం నీటి విడుదల చేస్తామని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం బాసటగా నిలుస్తుందన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగమంతా విపత్తు సంభవించిన గంటల్లోనే క్షేత్రస్థాయిలో సందర్శించి క్షణాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టామన్నారు. రెండు రోజుల్లో నీటిపారుదల శాఖ కు చెందిన 700 మంది ఏఈఈ లకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేస్తారని, త్వరలో 1800 మంది లష్కర్లను నియమిస్తామని వివరించారు.

అనంతరం 133.5 కి మీ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఫోన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో నీటి విడుదల అంశంపై మాట్లాడారు. అక్కడ నుంచి 128.24 కిలో మీటర్ వద్ద నిర్మించిన క్రాస్ బండ్ వద్దకు చేరుకుని సైఫాన్ ద్వారా దిగువకు ప్రవహిస్తున్న నీటి తీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎన్నెస్పీ సీఈ రమేష్ బాబు, ఎస్ఈ శివ ధర్మతేజ, ఈఈ రాంకిషోర్, డీఈ రఘు, ఏఈ సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బీ. వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.


Similar News