డెకాయిటీ కేసులో 5గురు దొంగల అరెస్ట్

ఓ ఆటో డ్రైవర్ ధైర్యంగా అందించిన సమాచారంతో డెకాయిటీ దొంగల ముఠా అరెస్టు సులభతరం అయ్యిందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.

Update: 2024-09-24 13:25 GMT

దిశ, సూర్యాపేట: ఓ ఆటో డ్రైవర్ ధైర్యంగా అందించిన సమాచారంతో డెకాయిటీ దొంగల ముఠా అరెస్టు సులభతరం అయ్యిందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. అందుకు సైంటిఫిక్ ఆధారాలు వినియోగించడం వల్ల కేసును త్వరితంగా ఛేదించినట్లు ఆయన వెల్లడించారు. ఇలాంటి కేసు కొన్నేళ్లుగా జిల్లాలో ఎక్కడ కూడా నమోదు కాలేదని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈనెల 19న జిల్లాలోని మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ డెకాయిటీ దొంగతనం కేసును ఛేదించడం ద్వారా దొంగల నుంచి రూ.1.62 లక్షల విలువ గల 6.5 తులాల బంగారం, 12 వేల విలువ గల 30 తులాల వెండి, రూ.3.5 లక్షల విలువ గల నేరానికి వాడిన ఇన్నోవా కారు, రూ.75 వేల విలువ గల 5 మొబైల్స్ తో మొత్తం రూ.6 లక్షల 38 వేల విలువ కలిగిన ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసు ఛేదనలో కోదాడ సబ్ డివిజన్ పోలీసులు 7 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు.

మేళ్లచెరువు శివారు వెల్లటూరు కాలనీ గ్రామంలో 19వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఐదుగురు దొంగలు తమ్మిశెట్టి వెంకయ్య అనే బ్రిక్స్ వ్యాపారి ఇంట్లో తలుపు, ఇనుప ప్లేట్ కట్ చేసి అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించారు. వారి వద్ద ఉన్న ఆయుధాలతో వెంకయ్యతో ఇద్దరు కూతుర్లను బెదిరించి బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.50 వేల నగదును దోచుకెళ్లారు. దీనిపై వెంకయ్య ఫిర్యాదు మేరకు మేళ్లచెరువు ఎస్సై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అందుకు నిందితులపై సెక్షన్ 165/2024, 310(2), 333, 127(2) భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం డెకాయిటీ దొంగతనం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కోదాడ రూరల్ సీఐ రజిత రెడ్డి, తన సిబ్బందితో అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365 పై శాంతినగర్ వద్ద మంగళవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా వస్తున్న ఇన్నోవా కారును గుర్తించి తనిఖీ చేశారు.

అందులో ఉన్న 5 గురు వ్యక్తులను గుర్తించి విచారించారు. కాగా వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఏ 1 వేమవరపు నాగరాజు, ఏ 3 వేమవరపు పుల్లారావు, ఏ4 బిక్షాలు, నల్గొండ జిల్లాకు చెందిన ఏ 2 రమావత్ మాత్రు, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఏ 5 చిక్కల ఆంజనేయులు లను అదుపులోకి తీసుకుని విచారించగా బ్రిక్స్ వ్యాపారి వెంకయ్య ఇంట్లో కత్తులతో బెదిరించి దొంగతనానికి పాల్పడినట్లు వారు అంగీకరించారు. వీరిపై గతంలో పలు స్టేషన్ లలో కేసులు నమోదైనట్లు రికార్డులో ఉందన్నారు. ఈ కేసులో కీలక సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్ ధైర్యంగా పోలీసులకు సహకరించడంతో ఎస్పీ అతన్ని సన్మానించారు. ఈ కేసులో భాగా పని చేసిన అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ రజిత రెడ్డి, మేళ్లచెరువు ఎస్సై పరమేష్, అనంతగిరి ఎస్సై నవీన్, కోదాడ రూరల్ ఎస్సై అనిల్ రెడ్డి, చింతలపాలెం ఎస్సై సైదిరెడ్డి, సీసీఎస్ సిబ్బందిని, ఐటీ సెల్ సిబ్బందిని, సబ్ డివిజన్ టెక్నికల్ టీం సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డ్స్ అందించారు.


Similar News