జిల్లాలో దూకుడు పెంచుతున్న హస్తం..

సూర్యాపేట జిల్లాలో ( బీఆర్ఎస్) కారు పార్టీ ఖాళీ అవుతుంది..

Update: 2024-12-17 10:14 GMT

దిశ, సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లాలో ( బీఆర్ఎస్) కారు పార్టీ ఖాళీ అవుతుంది.. గత పది సంవత్సరాలు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండగా సూర్యాపేట నియోజకవర్గంలో 10 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిన జగదీష్ రెడ్డి మాత్రమే గెలిచారు. మిగిలిన మూడు సిటింగ్ స్థానాలు కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి స్థానాల్లో పరాజయం పాలు అయ్యాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బరిలో నిలవాలన్న నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల జరిగి ఏడాది గడుస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఇంకా స్తబ్దుగానే ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ లో కూడా నల్గొండ, భువనగిరి స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పాటు, పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిటింగ్ స్థానాన్ని కూడా కోల్పోవడం, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో నాయకులు కార్యకర్తలు కృంగిపోతున్నారు. జిల్లాలో సూర్యాపేట నుంచి గెలిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంతా తానై పార్టీని భుజాన మోస్తున్నారు.

స్థానిక సంస్థల కోసం ఎదురుచూస్తున్న నాయకులు..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది కాలం అవ్వడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు ముమ్మర ప్రయత్నం చేస్తుండడంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్నారని సమాచారం. హుజూర్నగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన సైదిరెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలవడం ఓటమిపాలైన విషయం అందరికీ తెలిసిందే.. హుజూర్నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడు లేకపోవడంతో హుజూర్నగర్ నియోజకవర్గ బాధ్యతలు చూసే నాయకులు లేరని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, పట్టబద్ధుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి నుంచి బీఆర్ఎస్ నాయకులు తేరుకోక ముందే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందడి మొదలవుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సూర్యాపేటలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఓటమిపాలైన సూర్యాపేట నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అత్యధిక స్థానాలను గెలిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమి పాలైన పట్టువదలని విక్రమార్కుడిలా సూర్యాపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటు పార్టీని బలోపేతం చేస్తున్నారు. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన నాయకులు పటేల్ రమేష్ రెడ్డికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం సూర్యాపేట నియోజకవర్గ ప్రజలలో నూతన ఉత్సాహాన్ని అందించింది.

అదేవిధంగా తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యూల్, కోదాడ ఉత్తమ్ పద్మావతి, హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రిగా పదవి చేపట్టడంతో సూర్యాపేట జిల్లాలో రానున్న రోజుల్లో కారు పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ఎటు చూసినా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీటికెట్లు సంపాదించుకోవడానికి నాయకులు ఇప్పటినుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయని ధీమా..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరుస్తాయని నాయకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచి కార్యకర్తలను, నాయకులను కాపాడుకుంటూ స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపించుకుంటుందా లేక కార్యకర్తలు నాయకులు దూరం చేసుకుంటుందా ఎదురు చూడాలి.


Similar News