ఆగని ఫార్మా కంపెనీ నిర్మాణ పనులు.. వారిని రక్షించే నాథుడే లేరా..!
ప్రకృతి కి నెలవైన పచ్చని పల్లెలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి.

దిశ, మునుగోడు: ప్రకృతి కి నెలవైన పచ్చని పల్లెలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. ప్రకృతికి హాని కల్గించే ఫార్మా కంపెనీలు పట్టణాలను వదిలి పల్లేల వైపు పాగా వేస్తున్నాయి. తక్కువ ధరలకు భూములు దొరకుతుండడంతో కంపెనీ యాజమానులు వందల ఎకరాలు కొనుగోలు చేసి కంపెనీలు నిర్మిస్తున్నారు. ఎన్నో ఎళ్లుగా మునుగోడు ఫ్లోరైడ్ తో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ఫార్మా రక్కసి వచ్చి ఈ ప్రాంతాన్ని పొల్యూట్ చేసేందుకు కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయి. ఫార్మా కంపెనీ ఏర్పాటు జరిగితే అవి వెదజల్లే వ్యర్థ రసాయనాలు భూమిలోకి వెళ్లి భూగర్భ జలాల్లో కలిసి గాలి, నీరు, పంటలు కలుషితమైతాయి. మునుగోడు మండల పరిధిలోని క్రిష్టాపురం గ్రామ శివారులో రెండు సంవత్సరాల క్రితం సన్ లైట్ యాక్టివ్ ఫార్మా సుటికల్స్ పేరుతో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటు జరిగితే కంపెనీ విచ్చల విడిగా వెదజల్లే వ్యర్థ రసాయనాలు భూమిలోకి చేరి భూగర్భ జలాల కలుషితం చేయనున్నాయి. ఈ కలుషితమైన నీరు ఈ ప్రాంతలోని పశువులు, పక్షులు, ప్రజలు తాగితే అవి అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉంది.
కాలుష్య బారిన పడనున్న మరికొన్ని గ్రామాలు..
ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఫార్మా పరిశ్రమ వల్ల దిగువ గ్రామాలైన క్రిష్టాపురం, ఇప్పర్తి, పలివెల, కోతులారం, తదితర గ్రామాలు కంపెనీ వెదజల్లే వ్యర్థ రసాయనాలతో పాడిపంటలు, తాగే నీరు, పీల్చే గాలి కలుషితమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే చౌటుప్పల్ లాంటి ప్రాంతాల్లో వందల కొద్దీ ఫార్మా కంపెనీల రాకతో పూర్తి కాలుష్యం అయ్యింది. కావున ఇక్కడ కూడా పరిశ్రమ ఏర్పాటు చేయడంతో భవిష్యత్తులో సమీప గ్రామాలు ఖాళీ చేసి ప్రజలు వలసలు వెళ్లే ప్రమాదం ఉంది.
ఇది గమనించిన మండలానికి చెందిన అన్ని పార్టీలు, పలు సంఘాల నేతలు మునుగోడు నుంచి క్రిష్టాపురం వరకు పాదయాత్రలు,వరుసగా 6 నెలలు రిలే నిరాహార దీక్షలు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీ నిర్మాణ పనులు ఆపివేయాలని ఆదేశించడంతో కొద్ది రోజుల పాటు పనులు నిలిపివేశారు. గత సంవత్సరం నుంచి పనులు కొనసాగుతున్న ఉద్యమించిన నాయకులు అటు వైపే చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఫార్మా కంపెనీ పూర్తి అయితే పల్లెలన్ని కాలుష్యం కోరల్లో చిక్కుకొని ప్రజలు, పాడి పశువులు, పచ్చని పంట పొలాలు కలుషితమైయే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు స్పందించి ఫార్మా కంపెనీ నిలిపివేతకు కృషిచేసి, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని కల్పించాలని పలువురు కోరుతున్నారు.
పచ్చని పొలాలపై ఫార్మా పాగా
కిష్టాపురం గ్రామ శివారు ప్రాంతంలోని పచ్చని పొలాల్లో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీతో పర్యావరణం, చెట్లు, చేమ, చెరువులు, కుంటలు, భూమి, మట్టి, నేల, గాలి వంటి అన్ని రకాల సహజ వనరులు కలుషితమై భవిష్యత్తు తరాల ఉనికే ప్రశ్నార్థకంగా మారనున్నది. కిడ్ని సమస్యలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ తో పాటు అనేక వ్యాధుల బారిన పడాల్సిన దుస్థితి నెలకొంటుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఏర్పాటు అయితే ఫార్మా కంపెనీ విడిచిపెట్టే వ్యర్థాలు కంపెనీ సమీపంలో ఉన్న వాగులోకి వెళ్తే వాగు ద్వారా మునుగోడు మండలంలోని సగానికి పైగా గ్రామాలకు ప్రవహించే అవకాశం ఉన్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ప్రాంతాన్ని పొల్యూట్ చేస్తే ఊరుకునేది లేదు : తెలంగాణ రిటైర్డ్ ఇంజనీరింగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి.
మునుగోడులోని క్రిష్టాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న ఫార్మా కంపెనీ వల్ల గాలి, భూగర్భ జలాలు కలుషితమైయే ప్రమాదముంది. వెంటనే ఆ కంపెనీ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. కొన్ని రోజులు పనులు ఆపినట్టు చేసి మళ్లీ పనులు చేపట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఈ ప్రాంతాన్ని ఈ ఫార్మా కంపెనీలు పొల్యూట్ చేస్తే ఊరుకునేది లేదు.