ఇచ్చిన హామీలను అమలు చేయాలి
ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు.

దిశ,రామన్నపేట : ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ డిమాండ్ చేశారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రామన్నపేట మండల సమగ్రాభివృద్ధి-ప్రజా సమస్యల పరిష్కారానికి మండల వ్యాప్తంగా ఆరు రోజుల పాటు చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర ప్రారంభ సభ కొమ్మాయిగూడెంలో జరిగింది. ప్రారంభ సభకు ముఖ్య అతిధిగా హాజరైన జాన్ వేస్లీ మాట్లాడుతూ.. గత సంవత్సర కాలం నుండి గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గాలు లేక ప్రజా వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిందని అన్నారు. ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాలకు నిధులు రాక అభివృద్ధి కుంటు పడిందన్నారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒకే ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. ఇటీవల పెట్టిన కేంద్ర,రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయించకుండా ఎలా అమలు చేస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలిచ్చింది కానీ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. రామన్నపేట ప్రాంతంలో రైతులను నమ్మించి వందలాది ఎకరాలను కొనుగోలు చేసి ప్రజల ప్రాణాలు తీసే కాలుష్య పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటే సిపిఎం ఊరుకోదని అన్నారు.
రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకలకు పెంచి మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ మండలంలో అనేక గ్రామాలకు రోడ్ల సౌకర్యం, బస్సు సౌకర్యం లేకపోవడం విచారకరం అన్నారు. దశబ్దాలు గడుస్తున్నా ధర్మారెడ్డిపల్లి, పిలాయిపల్లి కాలువలను పూర్తి చేసి నీరు అందివ్వక పోవడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం అన్నారు. కాంట్రాక్టర్లకు వర ప్రదాయనిగా మారింది తప్ప పూర్తి కావడం లేదన్నారు గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్తారన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరిచేదాకా పోరాటం ఆగదు
మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించే దాకా సిపిఎం పోరాటం ఆగడని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలని అధ్యయనం చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడడమే ప్రజా చైతన్య పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు. రామన్నపేట గతంలో నియోజకవర్గ కేంద్రంగా, తాలూకాగా విలసిల్లి ఇప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందన్నారు. ప్రస్తుతం జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేటను మళ్ళీ నియోజకవర్గంగా పునః రుద్దరించాలి అన్నారు. తరలిపోతున్న ప్రభుత్వ కార్యాలయాలను కాపాడాలని అన్నారు. పజా సమస్యలపై జరిగే పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్నారు.
అంబుజా సిమెంట్ ప్రతిపాధిత స్థలం గేటు ముందు రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ, పాదయాత్ర బృందంతో కలసి నిరసన తెలిపారు. రామన్నపేట మండల కేంద్రంలో భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, బట్టుపల్లి అనురాధ,రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి,జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బూర్గు కృష్ణా రెడ్డి, పాదయాత్ర బృందం సభ్యులు జిల్లా జల్లెల పెంటయ్య,బొడ్డుపల్లి వెంకటేశం,బోయిని ఆనంద్,కందుల హనుమంతు,గన్నేబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, గొరిగే సోములు,బోడిగే రజిత, మేడి గణేష్, కొమ్ము అంజమ్మ, శానగొండ రాము, జిల్లా కమిటీ వనం ఉపేందర్, బల్గురు అంజయ్య,మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరేళ్ళ నర్సింహా చారి, కల్లూరి నగేష్,మాజీ వైస్ యం పిపి నాగటి ఉపేందర్, శాఖ కార్యదర్శి శానగొండ వెంకటేశ్వర్లు, పులి బిక్షం, మునికుంట్ల లెనిన్ తదితరులు పాల్గొన్నారు.