డిఈసి ఇండస్ట్రీస్ లో ఇద్దరు యువకులు మృతి
ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ట్రేనింగ్ ఉద్యోగులుగా పనిచేసే ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

దిశ, చిట్యాల: ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ట్రేనింగ్ ఉద్యోగులుగా పనిచేసే ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామ పరిధిలోని డిఇసి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఐటిఐ పూర్తి చేసి అప్రెండ్షిప్ కోసం కంపెనీలో ట్రైనింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఇద్దరు యువకులు మధ్యాహ్న సమయంలో కంపెనీ ఆవరణలో ఉన్న పాత బావి వద్దకు ఈత కొట్టడానికని వెళ్లారు. అనంతరం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి అందులో పడి మునిగిపోతుండడంతో.. అతనిని బయటికి తీసే ప్రయత్నంలో మరో వ్యక్తి కూడా నీళ్లలో పడి మృతి చెందినట్లు తెలుస్తుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. యాజమాన్యం కంపెని గేట్లు మూసి ఎవర్ని లోనికి అనుమతించడం లేదు. దీంతో యువకుల మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కంపెనీలో సుమారు 800 నుంచి 1000 మంది దాకా పని చేస్తారని తెలుస్తుంది. మృతి చెందిన యువకులు నల్లగొండ మండలం ముషంపల్లికి నలుపు రాజు నవీన్( 20), మరొకరు సూర్యాపేటకు చెందిన చింతపల్లి రాఘవేంద్ర 22 గా గుర్తించడం జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కంపెనీలో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కంపెనిలో పనిచేస్తున్న సుమారు 800 నుంచి 1000 మంది కార్మికులు నిత్యం ఏదో ఒక ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ కంపెనీ యాజమాన్యం సక్రమంగా స్పందించడం లేదని పలువురు కార్మికుల ఆరోపిస్తున్నారు. కంపెనీ యాక్ట్ రూల్స్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయని కార్మికులు చెబుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు పూర్తి విచారణ చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.