రైతుకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతుల చేతులకు బేడీలు చూసి తన గుండె బరువెక్కిందని, సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఇది న్యాయమా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.

Update: 2023-06-13 11:10 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: న్యాయం కోసం పోరాటం చేస్తున్న రైతుల చేతులకు బేడీలు చూసి తన గుండె బరువెక్కిందని, సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఇది న్యాయమా అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. రాయగిరి త్రిబుల్ ఆర్ భూములకు సంబంధించిన పోరాటంలో రిమాండ్ కు వెళ్లిన రైతులను భువనగిరి కోర్టుకు చేతులకు బేడీలు వేసి తీసుకువచ్చిన ఘటనపై ఆయన స్పందించారు. భూ సేకరణ పేరుతో బలహీన వర్గాల ప్రజల భూములను బలవంతంగా లాక్కోవడం, వాటి పక్కనే ప్రభుత్వ భూములు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

కేవలం ఎకరా, రెండు ఎకరాలు ఉన్న రైతులను తమ తరతరాల నుండి వస్తున్న భూములను లాక్కోవడంతో.. తీవ్ర బాధకు గురైన రైతులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న క్రమంలో వారిని అరెస్టు చేసి జైలుకు తరలించడం బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ఆ రైతులకు భువనగిరి జైలుకు తరలించే క్రమంలో వారి చేతులకు బేడీలు వేసి తీసుకురావడం అత్యంత ఘోరమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న రైతు చేతికి సంకెళ్లు వేయించడం సీఎం కేసీఆర్ సర్కారుకు తగదని చెప్పారు. రైతు సంక్షేమం కోసం ఎంతో చేస్తున్న అని గొప్పలు చెప్పుకునే సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, రైతులకు బేడీలు వేసిన సంబంధిత పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Similar News