నాడు వెళ వెళ... నేడు కళ కళ..
సూర్యాపేట జిల్లాలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామపరిధిలోని మల్లన్న గుట్టల వద్ద ఉన్న రుద్రమ్మ చెరువు నేడు శ్రీరామ్ సాగర్ రెండో దశతో నీటితో కళకళలాడుతోంది.
దిశ, తుంగతుర్తి : సూర్యాపేట జిల్లాలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటైన తుంగతుర్తి మండలం వెలుగుపల్లి గ్రామపరిధిలోని మల్లన్న గుట్టల వద్ద ఉన్న రుద్రమ్మ చెరువు నేడు శ్రీరామ్ సాగర్ రెండో దశతో నీటితో కళకళలాడుతోంది. అంతేకాదు అక్కడి పరిసరాలు చూసేవారికి అద్భుతం కలిగిస్తున్నాయి. వేసవికాలం రాకముందే నీరు లేక నెర్రలు చాచి కరువు పరిస్థితులకు అద్దం పడుతూ భయంకరంగా కనిపించే రుద్రమ చెరువు వందలాది ఎకరాల్లో విస్తీర్ణం కలిగి ఉంది.
ప్రతి ఏడాది కురిసే కొద్దిపాటి వర్షాలతో చెరువు అంతంత మాత్రంగానే నిండి కాలానుగుణంగా ఎప్పటిలాగే ఎండిపోయి నెర్రలు చాస్తుంటుంది. దీంతో వ్యవసాయ రంగం కుదేలవుతూ రైతాంగాన్ని కరువు వైపు కదిలిస్తుంది. కాగా ఇలాంటి పరిస్థితుల మధ్య శ్రీరామ్ సాగర్ రెండవ దశకాలువ అనుసంధానం చేయడంతో రుద్రమ చెరువు రూపురేఖలే మారిపోయాయి. వేసవిలో సైతం చెరువు నిండి కళకళలాడుతోంది. నిత్యం పోస్తున్న అలుగుల ద్వారా వెలుగుపల్లి, జొన్నలగడ్డ తండ, కాశితండ, పర్సాయిపల్లి, సీతారాంపురం, పసునూరు, అన్నారం, సంగెం, తదితర ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటుంది. రుద్రమ చెరువు నీటితో కరవు పరిస్థితులను జయించామని రైతాంగం సంబరపడుతోంది.