శివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు.. ఆ ఆలయం మరింత ప్రత్యేకం

Update: 2022-02-22 07:47 GMT

దిశ, గరిడేపల్లి: మహా శివరాత్రి సందర్భంగా మండలంలో ఉన్న అన్ని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. మండలంలో ఉన్న అన్ని శివలయాల్లోకి పోనుగోడు గ్రామంలోని త్రిలింగేశ్వర ఆలయం చాలా ప్రసిద్ది చెందినదిగా చెప్పుకోవచ్చు. 

త్రిలింగేశ్వర ఆలయం చరిత్ర

పోనుగొడు గ్రామంలో ఉన్న అతి పురాతనమైన  శివాలయం పూర్తిగా రాతితో  కాకతీయుల కాలంలో నిర్మించబడినదని చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయానికి దాదాపు 500-600 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలో 3 లింగాలు పడమర, తూర్పు, దక్షిణ దిక్కుల్లో ఉన్నాయి. అందుకే ఈ ఆలయానికి త్రిలింగేశ్వరాలయం అని పేరు వచ్చింది. అయితే ఈ ఆలయానికి  కాల క్రమేణా ఆదరణ తగ్గి 1995 సంవత్సరానికి పూర్వం దాదాపు 150 సంవత్సరాల పాటు ఎటువంటి పూజలు, పురస్కారాలు జరగకపోవడంతో ఆలయం చుట్టూ గడ్డి వాములు వేశారు. దీంతో ఆలయం పూర్తిగా పాడుపడిపోయింది. కానీ గ్రామస్థుల సహకారంతో 1995 నుంచి ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నామని స్థానికులు అంటున్నారు. అదే విధంగా శివలింగం చుట్టూ బ్రహ్మ స్తోత్రం కలిగిన శివాలయం ఇది ఒక్కటే అని, ఇలాంటి ప్రత్యేకత కలిగిన శివాలయం మన రాష్ట్రంలో ఎక్కడా లేదని ఆలయ పూజారి అన్నారు.

నాగుల బావి ప్రత్యేకత

ఈ ఆలయం ఆవరణలో ఒక బావి ఉంది. దానిని నాగుల బావి అని పిలుస్తారు.  అంటుతో ఉన్న మహిళలు ఈ బావిని ముట్టుకుంటే అందులోని నీళ్లన్నీ పురుగుల మయం అయ్యేవని, పేరులో మొదటి అక్షరం కలిసిన దంపతులు కలిసి బావిలో పాలు పోస్తే మరలా ఆ నీరు శుభ్రంగా అయ్యేవని స్థానికులు తెలిపారు.

ఆదరణకు నోచుకోని శివాలయం

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది ఈ ఆలయ పరిస్థితి. ఈ పురాతన ఆలయం పేరుకు కాకతీయుల కాలంలో నిర్మించిందే అయినా ప్రభుత్వ ఆదరణకు మాత్రం నోచుకోవట్లేదు. దీంతో ఆలయ అభివృద్ధి చెప్పుకోదగ్గ రీతిలో జరగట్లేదని, ఈ ఆలయానికి చెందిన భూములు కూడా లేవని, గ్రామస్థులు, దాతల సహకారంతో ఈ ఆలయంలో పూజలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆలయాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఆలయ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ప్రతి ఏడాది వేలమంది దర్శన

ప్రతి సంవత్సరం శివరాత్రి, కార్తీక మాసం సమయాల్లో  భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, ప్రతి సంవత్సరం శివరాత్రి  ఉత్సవాలలో  ఈ ఒక్క గ్రామ ప్రజలే కాక, చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు కూడా పాల్గొంటారని, అదే విధంగా శివరాత్రి  సందర్భంగా దాతల సహకారంతో  7-8 క్వింటాళ్ల బియ్యంతో అన్నదాన కార్యక్రమం, కబడ్డి , నృత్య పోటీలు నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తారు అని స్థానికులు తెలిపారు.

Tags:    

Similar News