త్రిబుల్ ఆర్ బాధితుల పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు..
త్రిబుల్ ఆర్ బాదితుల పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దిశ, భువనగిరి రూరల్ : త్రిబుల్ ఆర్ బాదితుల పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్రిబుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చాలని రాయగిరి వాసులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్ తో జిల్లా కలెక్టరెట్ ఎదుట రెండు రోజులుగా దీక్ష కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పై సమీక్షకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి మంగళవారం నాడు కలెక్టరేట్ కు వచ్చారు. ఈ నేపధ్యంలో మంత్రి కాన్వాయ్ ని రైతులు అడ్డుకున్నారు. అడ్డుపడిన రైతులను పోలీసులు పక్కకు నెట్టివేశారు. ఈ ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఆందోళనకు దిగిన రైతుల్లో ఆరుగురు పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. వీరిలో ఇద్దరు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. మల్లేష్ యాదగిరి నిఖిల్ బాలులను పోలీసులు బుధవారం రిమాండ్ చేశారు. రైతుల పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల పై కేసులు పెట్టడాన్ని ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు.
కక్ష సాధింపు చర్యలకు పూనుకున్న ఎమ్యెల్యే : కుంభం అనిల్ కుమార్ రెడ్డి,డీసీసీ యాదాద్రి అధ్యక్షుడు
కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఆర్ఆర్ఆర్ బాధితులను అక్రమ అరెస్టు చేసి, కేసులు బనాయించి, జైలులో నిర్బంధించి, స్థానిక ఎమ్యెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని యాదాద్రి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాడు కనీసం వారిని పరామర్శించకుండా ఉన్నటువంటి ఎమ్యెల్యే వైఖరి ఏ మాత్రం సరికాదు అని ఆయన అన్నారు. బుధవారం నాడు భువనగిరి సబ్ జైలులో రిమాండ్ లో ఉన్నటువంటి రైతులను ఆయన కలిసి పరామర్శించారు.