ఖరీఫ్ సాగుకు సన్నద్ధం..లక్ష ఎకరాల పైనే సాగు

నియోజకవర్గమైన తుంగతుర్తి ప్రాంతంలో ఖరీఫ్ పంటల సాగుకు రైతాంగం సిద్ధమవుతోంది.

Update: 2023-05-22 13:55 GMT

దిశ,తుంగతుర్తి: నియోజకవర్గమైన తుంగతుర్తి ప్రాంతంలో ఖరీఫ్ పంటల సాగుకు రైతాంగం సిద్ధమవుతోంది.మొన్నటి రబీలో వాతావరణం విధిలించిన చేదు పరిస్థితులను ఓవైపు నెమరేసుకుంటూ మరోవైపు ఖరీఫ్ సీజన్ పై ఆశలతో ముందడుగు వేస్తున్నారు.ఈ మేరకు రైతులు ఇప్పటి నుంచే దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతున్నారు.ముఖ్యంగా ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలతో రైతాంగం ఉదయం..సాయంత్రం సమయాలలో వ్యవసాయ పనులను నిమగ్నమవుతున్నారు.తొలుత చెలుకల్లో ఉన్న పత్తి,మొక్కజొన్న,మిరప,తదితర పంటలకు సంబంధించిన చెత్త,ఎండిన కర్రలను ఏరుతూ శుభ్రం చేసి తగలబెడుతున్నారు.అనంతరం ట్రాక్టర్లు,ఎడ్ల బండ్ల ద్వారా రైతులు తమ తమ ఇంటి పరిసరాల్లో ఉన్న పెంట ఎరువును చెలుకల్లోకి తోలుతున్నారు.ఇదిలా ఉంటే మరోవైపు వరి పంట సాగుకు గతంలో పొలాల్లో ఉన్న వరి మొదళ్లను కొంతమంది రైతులు నిప్పు పెట్టి కాల్చి వేస్తుండగా మరికొందరు మాత్రం నీళ్లు పారించి నాగళ్ళతో దున్నుతూ చదును చేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా శ్రీరాంసాగర్ రెండో దశ కాలువల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గానికి నీళ్లు వస్తుండడంతో తుంగతుర్తి,తిరుమలగిరి,నాగారం, జాజిరెడ్డిగూడెం,నూతనకల్,మద్దిరాల మండలాల వ్యాప్తంగా చెరువులు,కుంటలు పుష్కలంగా నిండిపోతున్నాయి.దీనికి తోడు ఖరీఫ్ లో వర్షాలు తోడవుతున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు కూడా పెరిగిపోయాయి.దీంతో రైతులు పంటల సాగుపై ముందస్తుగా దృష్టిని కేంద్రీకరిస్తున్నారు.ప్రతి ఏటా ఆరు మండలాల్లో కలిపితే అధికారిక లెక్కల ప్రకారం లక్ష ఎకరాల్లో వరి పంట సాగుతుంది.అనధికారికంగా మరో 5 వేల పైనే ఉంటుంది.


Similar News